నిజజీవితంలో చేయలేనివి పగటికలల్లో చేయొచ్చు. పైసా ఖర్చుకూడా ఉండదు. అదే అవకాశముంటే సినిమా తీసుకుని చూసుకోవచ్చు.
“నేనే గనక సీయం అయితే వైసీపీవాళ్ల ఇళ్లన్నీ పగలగొట్టిస్తా..వాళ్ల తాటతీస్తా” అంటూ వీరంగమాడుతున్నాడు పవన్ కళ్యాణ్.
అలా పిట్టలదొరలాగ స్టేట్మెంట్లు ఇచ్చే బదులు “తాట తీస్తా” అని టైటిల్ పెట్టుకుని తాను నిజంగా సీయం అయిపోయినట్టు, వైసీపీ వాళ్ల ఇళ్లు పగలగొడుతున్నట్టు సినిమా తీసుకోవచ్చుగా.
గతంలో అన్నయ్య చిరంజీవి కూడా “ముఠామేస్త్రి” సినిమాలో మంత్రైపోయి నానారకాల ఫైట్లు చేస్తాడు. చూడ్డానికి భలే సరదాగా ఉంటుంది. ఆ సినిమా క్లైమాక్సులో అన్నయ్యగారు “ప్రజస్వామ్యానికి కష్టమొస్తే చెప్పండి వస్తా..7 కోట్ల మందికి ముఠామేస్త్రిగా” అని డైలాగ్ చెప్పగానే నిజంగానే తదుపరి సీయం తమ అభిమాన నటుడే అని హాల్లో జనం ఈలలేసి పండగచేసుకున్నారు.
ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ నేరుగా సీయం అయిపోయినట్టు నటించేస్తే మంచిది. తాము జెండాలు ఎందుకు మోస్తున్నామో అర్థం కాక నిట్టూరుస్తున్న జనసైనికులకి కూడా ఊరట కలిగినట్టవుతుంది. అభిమానులైతే ఆ వర్చువల్ ప్రపంచంలో బతికి రాష్ట్రం పవరుస్టారుని పాలనలో ఉందన్న భ్రమలో తేలి తరిస్తారు.
నిజానికి పవన్ కళ్యాణ్ గానీ, కే.ఏ పాల్ గానీ తాము ముఖ్యమంత్రులైపోయినట్టు సినిమాలు చేసేసుకోవడం నయం. ఎందుకొచ్చిన ఊసుపోని ప్రచారాలు, కామెడీ విన్యాసాలూ?!
గోతికాడి నక్కలాగ అసలంటూ రేసులో నిలబడితే ఎప్పుడో అప్పుడు జనం సీయం పదవి పట్టం కట్టకపోతారా అనో, ఏదో జరిగి ఏ పార్టీకైనా ప్రభుత్వం ఏర్పరచడానికి తాను నిర్ణయాత్మకమైతే రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పేయొచ్చు కదా అనో..ఏవో భ్రమల్లో బతుకుతున్నట్టున్నాడు పవన్ కళ్యాణ్. తప్పులేదు. కానీ కనీసం ఎమ్మెల్యేగానైనా గెలవనివాడు, తన కేడర్ని గెలిపించుకోలేని వాడు, జనం మనసులు తాకి ఆ దిశగా అడుగులేయాలి కానీ ఇలా పంచ్ డైలాగులు కొడుతుంటే ఓట్లెవడేస్తాడనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఉన్నాడు.
పద్ధతికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించే పవన్ కళ్యాణ్ తాను ఏ రకంగా ప్రజాస్వామ్యరాజకీయాలకు బద్ధుడో చెప్పమంటే చెప్పలేడు. చట్టవిరుద్ధంగా కారు టాపెక్కి హైవే మీద ప్రయాణం చేస్తాడు, సభావేదికలమీద నిలబడి ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడుతూ “కొడకల్లారా” అంటూ బూతులు వల్లిస్తాడు. “తాట తీస్తా” అంటూ పేట్రేగిపోతాడు. తానేం చదివాడో తనకి తెలియదు. వైకాపా వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించి ఉన్న మూడు వ్యతిరేక పార్టీలని ఏకీకృతం చేస్తానని బీరాలు పలికాడు. తీరా మోదీని కలిసొచ్చి తెదేపాతో సంసారం చేస్తున్నందుకు చివాట్లు తిని, ఏం చెయ్యాలో తెలియక వైజాగ్ బీచ్ ఒడ్డుకి వెళ్లి వాకింగ్ చేసి కూర్చున్నాడు.
రాజకీయాల్లో తానేంటో, తన సీనెంతో చూసుకోకుండా ఇప్పుడు ఏవేవో మాస్ మసాలా డైలాగులు కొడుతున్నాడు. వాటికి సమాజంలో నవ్వులు రాలుతున్నాయి. అదే సినిమా తీసుకుంటే కాసులు రాలతాయి. అందుకే పనికొచ్చే పని చేయమనేది.
– ప్రదీప్ సి