ఎర్ర పరామర్శ: దింపుడు కళ్లెం ఆశలేనా?

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నెం.7691 ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రాజకీయ సమీకరణల విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్రమోడీ ప్రాపకంలో ఉంటూ, ఆయన గుడ్ లుక్స్ లో ఉంటూ.. ఈ…

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నెం.7691 ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రాజకీయ సమీకరణల విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్రమోడీ ప్రాపకంలో ఉంటూ, ఆయన గుడ్ లుక్స్ లో ఉంటూ.. ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. ఆయన భాజపా విధానాల భజన చేసినా, భాజపా నేతలతో భేటీ అయినా, కేంద్రం బిల్లులకు బేషరతు మద్దతు ప్రకటించినా అన్నింటి లక్ష్యం అదొక్కటే. కమలదళంతో కలిపి పొత్తులు కుదిరేను.. కుదరకపోయేను.. కనీసం వారితో విభేదించకుండా ఉంటే మనుగడ సేఫ్ గా ఉంటుందని ఆయన నమ్మకం. 

అయితే ఆయన అరెస్టు తర్వాత.. ఆసక్తికరమైన కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వామపక్ష నాయకులు, రెండు రోజులుగా చంద్రబాబు ఎపిసోడ్ ను తీవ్రాతితీవ్రంగా ఖండిస్తున్నారు. అటు సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ఈ అరెస్టులను రాజకీయ వేధింపులుగా ప్రకటించడం మాత్రమే కాదు. నారా లోకేష్ కు ఫోను చేసి పరామర్శించారు కూడా. 

అలాగే.. సీపీఎం రాఘవులు కూడా.. అవినీతికి పాల్పడిన కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తే.. ఇది రాజకీయ వేధింపు చర్య అని గగ్గోలు పెడుతున్నారు. దీంతో , వామపక్షాలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోడానికి దింపుడు కళ్లెం ఆశలతో ఈ పరామర్శలు చేస్తున్నాయేమో అనిపిస్తోంది. 

ఒకవైపు చంద్రబాబు మోడీ దయకోసం అర్రులు చాస్తుండగా.. మోడీ కి తెలియకుండా ఈ అరెస్టు జరగదని, కాబట్టి మోడీని నమ్ముకోవడం వేస్టు అని వీరు లోకేష్ కు నూరి పోసే ప్రయత్నం చేస్తున్నారేమో అని పలువురు భావిస్తున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్ష పార్టీలకు సొంత అస్తిత్వం ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డితో ఎంత సఖ్యంగా ఉన్నా.. ఆయన పొత్తులకు ఆసక్తి చూపే రకం కాదు. దీంతో తెలుగుదేశం పంచన చేరి ఇచ్చినన్ని సీట్లు పుచ్చుకోవడం మినహా వారికి వేరే ఆలోచన ఉండకపోవచ్చు.

అయితే వారెన్ని ఆశలు పెట్టుకున్నా.. మోడీకి ఆగ్రహం తెప్పించేలాగా వారితో పొత్తుకు బాబు ఒప్పుకోరనేది పరిశీలకుల వాదన. జైళ్లు తమకు బాగా అలవాటు అయిన వామపక్ష నాయకులు, చంద్రబాబు జైలుకెళ్తే మాత్రం ఎందుకింత విలపిస్తున్నారో.. ఈ సాంత్వన వచనాలు దేనికోసమో అర్థం కావడం లేదు.