చంద్ర‌బాబును ఏమైనా చేస్తార‌నే అనుమానం!

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి అరెస్ట్‌ను టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఏసీబీ కోర్టులో ఆయ‌న‌కు బెయిల్ ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న్ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో బాబు జైలుపాలు కావ‌డాన్ని…

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి అరెస్ట్‌ను టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఏసీబీ కోర్టులో ఆయ‌న‌కు బెయిల్ ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న్ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో బాబు జైలుపాలు కావ‌డాన్ని రాజ‌కీయంగా వాడుకోవాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్‌ను అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం క‌లిసింది. అనంత‌రం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జైల్లో చంద్ర‌బాబును చేస్తార‌నే అనుమానాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. కావాల‌నే చంద్ర‌బాబును జైలుకు పంప‌డం దారుణ‌మ‌ని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్ర‌బాబును 48 గంట‌ల పాటు రోడ్ల‌పై తిప్పి సైకో ఆనందాన్ని పొందార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

జైల్లో చంద్ర‌బాబును వేసి ఆయ‌న మ‌నో ధైర్యాన్ని ఎప్ప‌టికీ తొల‌గించ‌లేర‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ పార్టీకి సంక్షోభాలు కొత్త కాద‌ని, వాటిని అవ‌కాశంగా మ‌లుచుకుని ముందుకెళ్తామ‌న్నారు. ఈ కేసుతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబును జైల్లో ఏదో చేస్తార‌నే ప్ర‌చారం ద్వారా సానుభూతి పొందేందుకు టీడీపీ కొత్త డ్రామాకు తెర‌లేపింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చోటు చేసుకున్న పరిణామాల‌ను ప‌రిశీలిస్తే టీడీపీ ఆశించిన‌ట్టుగా చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల నుంచి సానుభూతి రాలేదు.

కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల‌తో అచ్చెన్నాయుడు నిర్వ‌హించిన కాన్ఫ‌రెన్స్ స‌మావేశంలో స్వ‌యంగా ఆయ‌నే ఆ మాట అన్నారు. అరెస్ట్ అయి సీఐడీ క‌స్ట‌డీలో చంద్ర‌బాబు వుంటే, క‌నీసం ఆ దరిదాపుల్లో టీడీపీ శ్రేణులే లేక‌పోవ‌డం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, చాలా ఆవేద‌న క‌లిగిస్తోంద‌ని అచ్చెన్నాయుడు వాపోయిన ఆడియో వైర‌ల్ అయ్యింది. దీంతో బాబుకు ప్రాణ‌హాని ఉంద‌నే ప్ర‌చారంతో అయినా టీడీపీకి మైలేజీ వ‌స్తుంద‌నే చిన్న ఆశ‌తో అచ్చెన్నాయుడు విమ‌ర్శ‌ల‌కు దిగార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.