పవన్.. సెట్ విడిచి సాముగరిడీలు ఎందుకు?

హీరో పవన్ కల్యాణ్ సెట్ లోనే తప్ప.. బయట కర్రసాముగరిడీలు చేస్తాడో ఏమో మనకు తెలియదు. ఎంత బాగా చేస్తారనేది అస్సలు తెలియదు. ఆయన రిలీజ్ చేయదలచుకున్నవి ఫోటోలు తప్ప మరేవీ మనకు కనిపించవు.…

హీరో పవన్ కల్యాణ్ సెట్ లోనే తప్ప.. బయట కర్రసాముగరిడీలు చేస్తాడో ఏమో మనకు తెలియదు. ఎంత బాగా చేస్తారనేది అస్సలు తెలియదు. ఆయన రిలీజ్ చేయదలచుకున్నవి ఫోటోలు తప్ప మరేవీ మనకు కనిపించవు. ఓకే అయిన షాట్ మాత్రమే సినిమాలోకి ఎక్కినట్టు. అందుకే ‘నేలవిడిచి సాము తగదు’ అనే సామెతను ‘సెట్ విడిచి సాముగరిడీలు ఎందుకు?’ అని చదువుకుంటే బాగుంటుంది. 

హరిహరవీరమల్లు సెట్స్ లో ఆయన సాముగరిడీలు అభిమానుల్ని బాగానే రంజింపజేశాయి. కానీ, సినిమా అసలు ఉందో లేదో, అవుతుందో కాదో, ఎప్పటికైనా వస్తుందో రాదో, ఆయన అలిగారో ఆగ్రహించారో ఎవ్వరికీ తెలియదు. అలాంటి ప్రయత్నమే ఆయన రాజకీయాల్లో కూడా చేస్తే ఎలాగ? ప్రతిపక్షం రూపంలో ఉన్న బొడ్డూడని పార్టీకి అధినేత. ఎంత మహా గొప్ప పార్టీ అయినా ప్రారంభంలో ఇలాగే ఉంటుంది. సాహసించి రాష్ట్రమంతా బరిలోకి దిగిన పార్టీ జనసేన. 

ఏదో జగన్ మీద ప్రజలు నమ్మకం పెట్టుకోబట్టి ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన వచ్చిన నాటి నుంచి వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని.. విపక్షాలు మాత్రమే అంటున్నాయి. ప్రజలకు ఆ మాటలు అనుభవంలోకి రావడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ అయిదేళ్ల కాలాన్ని పవన్ కల్యాణ్ ఎలా వాడుకోవాలి? 1) ప్రజల కోసం తాము నిలబడతామని నిరూపించుకోవాలి. 2) పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసుకోవాలి. 

ఒకటో పనిలో జనసేన పరవాలేదు. సీజనల్ గా చేసి వదిలేసేవే అయినా.. కొన్ని సమస్యల మీద పోరాటాలు చేశారు. రెండో పనిలో వారు ఏ దశలో ఉన్నారు. ప్రతిపక్షనేతగా ఉంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ప్రజలు ఇచ్చిన అపూర్వమైన అయిదేళ్ల కాలాన్ని పవన్ కల్యాణ్ ఎలా తగలేస్తున్నారు? ఆయన చంద్రబాబునాయుడు తైనాతీగా వ్యవహరించడంలో మాత్రమే తరించదలచుకుంటున్నారు! 

పార్టీ కేడర్ నిర్మాణానికి.. ఒక్కొక్క జిల్లాలో నాలుగైదు రోజులు తిష్టవేసి, అన్ని నియోజకవర్గాలకు అన్ని రకాల పార్టీ కమిటీలు ఏర్పాటు చేయడంలో ఆయనకు శ్రద్ధ  ఉండదు. టైం ఉండదు. చంద్రబాబును అరెస్టు చేయగానే పరుగెట్టుకు వెళ్లి రోడ్డు మీద పడుకోడానికి మాత్రం వీలవుతుంది. ఆయన ఇలాంటి చవకబారు చర్యల ద్వారా తన పరువు తానే తీసుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు అంతటి నిజాయితీపరుడని నమ్మితే.. 2019లో ఎందుకు బయటకు వచ్చినట్టు. ఆ ప్రభుత్వం మీద పవన్ చేసిన అవినీతి ఆరోపణలన్నీ కట్టుకథలా? ఆ కట్టుకథలతో ప్రజల్ని మోసం చేయాలని పవన్ ఆరోజున అనుకున్నారా? 

సూటింగా చెప్పాలంటే.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకే కేడర్ లేకుండా పోతోంది. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని వైసీపీలోకి వెళుతున్న వారు, అక్కడ తలుపులు మూసి ఉంటే, సైలెంట్ అవుతున్న వారు క్షేత్రస్థాయిలో పెరుగుతున్నారు. ఇలాంటి వాతావరణనాన్ని పవన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆలోచించుకోవాలి. 

చంద్రబాబు పాదధూళిని నుదుటి కుంకుమగా ధరించే ఆరాటం మానుకుని, తనకు ఒక పార్టీ ఉన్నదని, దాన్ని ఉద్ధరించుకోవాల్సిన పూచీ తనదేనని ఆయన గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే పార్టీ ఎందుకూ కొరగాకుండా పోతుంది. అప్పుడిక విలీనం చేయాలనుకున్నా కూడా అవకాశం ఉండదు.