వావ్‌… జ‌గ‌న్ స‌ర్కార్‌కు భారీ ఊర‌ట‌!

రాజ‌ధాని అమ‌రావ‌తి స‌హా భారీ ప్రాజెక్టుల‌లో చోటు చేసుకున్న అవినీతి అంతు తేల్చాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.…

రాజ‌ధాని అమ‌రావ‌తి స‌హా భారీ ప్రాజెక్టుల‌లో చోటు చేసుకున్న అవినీతి అంతు తేల్చాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. హైకోర్టులో టీడీపీకి అనుకూలంగా వ‌చ్చిన స్టేను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కొట్టి వేసింది.

చంద్రబాబు హ‌యాంలో ప‌లు కీలక విధానప‌ర‌మైన‌ నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అక్ర‌మాలు జరిగినట్లు గ‌తంలో ప్ర‌తిప‌క్ష పార్టీగా వైసీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాటి నిగ్గు తేల్చేందుకు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.  

సిట్‌ నియామకంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా త‌దిత‌రులు హైకోర్టును ఆశ్ర‌యించారు. సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ స్టేను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం బుధ‌వారం కీల‌క‌ తీర్పు వెల్లడించింది. ప్ర‌జాధ‌నం దుర్వినియోగం, అవినీతి, ఇత‌ర‌త్రా అంశాల‌పై ద‌ర్యాప్తు చేస్తే త‌ప్పేంట‌ని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని  షా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. దీంతో   హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్లు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది.  

మెరిట్స్ ప్రాతిప్రదికన ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సూచించింది. ఇదిలా వుండ‌గా సిట్ విచార‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌డంతో ఏపీ స‌ర్కార్ సంబ‌రం చేసుకుంటోంది. బాబు హ‌యాంలోని అవినీతి డొంక ఎంత వ‌ర‌కు క‌దులుతుందో చూడాలి.