ప‌త్రికా స్వేచ్ఛ‌… ఆత్మ వంచ‌న‌!

ఇవాళ (మే 3) ప్ర‌పంచ పత్రికా స్వేచ్ఛ దినం. ఒక ప్ర‌ముఖ సంస్థ ప్ర‌తి ఏటా ప్ర‌క‌టించే ప‌త్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో భార‌త్‌కు 150వ స్థానం ద‌క్కింది. మాన‌వ హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించే క్ర‌మంలో యునెస్కో…

ఇవాళ (మే 3) ప్ర‌పంచ పత్రికా స్వేచ్ఛ దినం. ఒక ప్ర‌ముఖ సంస్థ ప్ర‌తి ఏటా ప్ర‌క‌టించే ప‌త్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో భార‌త్‌కు 150వ స్థానం ద‌క్కింది. మాన‌వ హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించే క్ర‌మంలో యునెస్కో ప్ర‌పంచ ప‌త్రికా స్వేచ్ఛ దినోత్స‌వాన్ని నిర్వ‌హించ త‌ల‌పెట్టింది. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాల‌కు ర్యాంకింగ్ ఇవ్వాల్సి వ‌స్తే… 1000 లేదా 2వేల నెంబ‌రో వ‌స్తుందేమో! ఇందుకు కేవ‌లం ప్ర‌భుత్వాల‌ను నిందించ‌డం అంటే… అంత‌కంటే ఆత్మ వంచ‌న‌, ప‌ర‌నింద మ‌రొక‌టి లేదు.

త‌మకు న‌చ్చిన పాల‌కులంటే ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ఆహా, ఓహో అంటూ కీర్తిస్తాయి. లేదంటే నిత్యం వ్య‌తిరేక వార్త‌ల‌తో జ‌నాన్ని న‌మ్మించి, త‌మ ఆరాధ్య నాయ‌కుడి రాజ‌కీయ ప్ర‌యోజనాల కోసం ప‌రిత‌పిస్తుంటాయి. వీళ్ల‌కు నిజాలతో సంబంధం లేదు. కేవ‌లం లాభ‌న‌ష్టాలే అంతిమ ల‌క్ష్యంగా ఇవాళ మీడియా సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఉన్న‌ది లేన‌ట్టు, లేనిది ఉన్న‌ట్టు క‌నిక‌ట్టు విద్య‌ను మ‌న‌మిప్పుడు మీడియా చేస్తుంటే చూస్తున్నాం. గ‌తంలో ఇలాంటివి స‌ర్క‌స్‌ల‌లో చూసేవాళ్లం.

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించి వేయ‌డంలో ప్ర‌భుత్వాల‌తో స‌మానంగా మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాలు కీల‌క పాత్ర పోషించాయి. ఇప్పుడు ప‌త్రికా స్వేచ్ఛ గురించి మీడియా సంస్థ‌లే త‌ప్ప‌, జ‌ర్న‌లిస్టులు మాట్లాడ్డం మ‌రిచిపోయారు. ఎందుకంటే మీడియా సంస్థ‌ల రాజ‌కీయ ఎజెండానే త‌మదిగా భావిస్తే త‌ప్ప జ‌ర్న‌లిస్టులు బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేని దుస్థితి. ప‌త్రికా స్వేచ్ఛ‌ను ప్ర‌భుత్వాలు హ‌ననం చేస్తున్నాయ‌ని యాజ‌మాన్యాలు త‌ప్ప‌, మీడియా ప్ర‌తినిధులు రోడ్డెక్కి ఆందోళ‌న‌లు నిర్వ‌హించి చాలా కాల‌మే అయ్యింది.

తెలుగు స‌మాజంలో మీడియా రాజ‌కీయంగా విడిపోయింది. అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ ఉన్న ప‌త్రిక‌నే తీసుకుందాం. టీడీపీకి కొన్ని ద‌శాబ్దాలుగా కొమ్ము కాస్తోంది. ఈ మీడియా సంస్థ‌తో పాటు మ‌రికొన్ని తోక ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ఉన్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలున్న‌ట్టే, వాటికి అనుకూల‌, వ్య‌తిరేక మీడియా సంస్థ‌లే త‌ప్ప‌, స్వ‌తంత్రంగా ప‌ని చేసే ఏ ఒక్క మీడియా గ్రూపు మ‌న‌కు లేక‌పోవడం విషాదం.

రాజ‌కీయ పార్టీల ప్ర‌యోజ‌నాలే త‌మవిగా భావించే స‌ద‌రు మీడియా సంస్థ‌లు, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌త్యాన్ని స‌మాధి చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని వైనం క‌ళ్లెదుటే వుంది. స‌ద‌రు మీడియా సంస్థ‌లు త‌మ వ్యాపార ప్ర‌యోజనాల కోసం మాత్ర‌మే జ‌ర్న‌లిజాన్ని అడ్డంగా వాడుకుంటున్నాయి. యాజ‌మాన్యాల మెప్పు పొందేందుకు కొంద‌రు జ‌ర్న‌లిస్టులు తామే రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల అవ‌తార‌మెత్తి దిగంబ‌రంగా నాట్య‌మాడ‌డం నిత్యం చూస్తూనే ఉన్నాం.

తెలంగాణ‌లో త‌న వ్యాపార ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకుతున్న కేసీఆర్ స‌ర్కార్‌కు అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ ఉన్న ప‌త్రిక వెన్ను ద‌న్నుగా నిలిచింది. ఇదే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తే …అధికార పార్టీపై నిత్యం విషం చిమ్మ‌డ‌మే ల‌క్ష్యంగా క‌లాన్ని స్వేచ్ఛ‌గా దుర్విని యోగం చేస్తోంది. 

ఏ జ‌ర్న‌లిస్టు అయినా ఉన్న‌ది ఉన్న‌ట్టు రాస్తే… ప్ర‌చురించే, ప్ర‌సారం చేసే మీడియా సంస్థ‌లున్నాయా? అంటే.. లేవ‌నే స‌మాధానం వ‌స్తుంది. ప‌త్రికా స్వేచ్ఛ అనేది పెద్ద బూతు ప‌దం. ఇప్పుడంతా ప‌త్రికా య‌జ‌మానుల స్వేచ్ఛ త‌ప్ప‌, జ‌ర్న‌లిస్టులు స్వేచ్ఛ అనే మాటే లేదు. జ‌ర్న‌లిస్టుల స్వేచ్ఛ‌ను మొట్ట మొద‌ట హ‌త్య చేసిన ఘ‌న‌త ప‌త్రికా య‌జ‌మానుల‌దే.

ఆ త‌ర్వాత పాపం ప్ర‌భుత్వాల‌దే. ప‌త్రికా య‌జ‌మానులు అక్ష‌రాన్ని వ్యాపార స‌రుకుగా మార్చుకున్న త‌ర్వాత‌, ఇక స్వేచ్ఛ‌కు అర్థం ఎక్క‌డ‌? రాజ‌మండ్రి లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో త‌న పేరు లేకుండా, మిగిలిన వారి పేర్లు ప్ర‌చురించారంటూ ఇట‌వ‌ల ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ ప‌త్రిక బాగోతాన్ని బ‌య‌ట పెట్టారు. 

పెద్ద ప‌త్రిక ప‌రిస్థితే ఇలా వుంటే, ఇక మిగిలిన మీడియా యాజ‌మాన్యాల ధోర‌ణి ఎలా వుంటుందో ఊహించుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. జ‌ర్న‌లిస్టుల‌కు నిజంగా స్వేచ్ఛ ఇస్తే, మీడియా విశ్వ‌స‌నీయ‌త‌కు, స‌మాజానికి ఇవాళ ఈ దుస్థితి వ‌చ్చేది కాద‌నేది నిజం.