నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. యధావిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అబద్ధపు ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించడం అలవాటుగా చేసుకుంటూ పోతున్నారు. రేపు ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే తాము చేయలేని విషయాల గురించి కూడా, అర్థసత్యాలతో అబద్ధపు మాటలతో లోకేష్ ప్రజలను వంచిస్తూ ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి సంబంధించిన వ్యవహారమే ఇందుకు పెద్ద ఉదాహరణ.
రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నప్పటికీ, వ్యవసాయ మోటార్లకు కూడా మీటర్లు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా మీటర్లు పెట్టడం వలన రైతులకు వచ్చే నష్టం ఏమీ లేదని ఉచిత విద్యుత్తుకు ఎలాంటి ప్రమాదంలో లేదని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.
అయితే ఈ విషయంపై రాద్ధాంతం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వామపక్ష పార్టీలు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చాయి. తెలుగుదేశం మాత్రం మీటర్ల గురించి నోరు మెదపకుండా నిశ్శబ్దం పాటించింది. పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో ముందే మీటర్లు పెట్టినప్పటికీ.. స్థానికంగా వ్యతిరేకత మాత్రం రాలేదు.
ఈ మీటర్ల వ్యవహారాన్ని తెరమీదకుతెస్తూ, నెల్లూరు జిల్లా లో పాదయాత్ర కొనసాగిస్తున్న నారాలోకేష్ రైతులకు ఒక సందేశం ఇస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఆమోదం కోసం అధికారులు కాగితాలతో వస్తే రైతులు సంతకాలు పెట్టవద్దని లోకేష్ సూచిస్తున్నారు. ‘మీరు సంతకాలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటుంది’ అని ఒక వితండమైన వాదనను నారా లోకేష్ తెరమీదకి తెస్తున్నారు.
అంతే తప్ప, ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోము అనే మాట ఆయన చెప్పడం లేదు. ఎందుకంటే మీటర్లు పెట్టడం అనేది అనివార్యం అనే సంగతి లోకేష్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వ విధానాలను పాటించి తీరాల్సిందే.. అని ఆయనకు తెలుసు. కేంద్రంతో తగాదా పెట్టుకుని వారి వైఖరిని నిరసించే కేసీఆర్ ప్రభుత్వం లాంటి వాళ్ళు తప్ప ఎవరైనా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాల్సిందే అనే విషయంలో నారా లోకేష్ కు స్పష్టత ఉంది.
అసలు బిజెపితో పొత్తుల కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు నాయుడు, ఈ మీటర్లను వ్యతిరేకిస్తారని అనుకోవడం భ్రమ. అయితే ఆ విషయాల గురించి లోతుగా ఏమీ చెప్పకుండా చర్చించకుండా, జగన్ ప్రభుత్వ హయాంలో బిగించడానికి అధికారులు వస్తే సంతకాలు పెట్టవద్దని లోకేష్ రైతులను రెచ్చగొట్టడం దిగజారుడుతనం లాగా కనిపిస్తోంది. లోకేష్ కుయుక్తులను రైతులు అర్థం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వంచన తేట తెల్లం అవుతుంది.