ఆందోళనలు సరే ….నాయకులు కలిసి రావాలి కదా!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో నిండా మునిగిపోయింది. కారణం పార్టీ నాయకుల్లో ఐక్యత లేకపోవడమే. బీజేపీలోనూ అనైక్యత ఉంది. లేదని చెప్పలేం. కానీ ఆ పార్టీ ఓడిపోయినా…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో నిండా మునిగిపోయింది. కారణం పార్టీ నాయకుల్లో ఐక్యత లేకపోవడమే. బీజేపీలోనూ అనైక్యత ఉంది. లేదని చెప్పలేం. కానీ ఆ పార్టీ ఓడిపోయినా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది. కారణం విభేదాలను బహిరంగంగా రచ్చ రచ్చ చేసుకోకపోవడమే. కాంగ్రెస్ లో అనైక్యతకు ప్రధాన కారణం …. వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారని. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన జూనియర్. అయినప్పటికీ తన చురుకుదనంతో అధిష్టానం మెప్పు పొందాడు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి జవసత్వాలు తేవాలని మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడు.

కానీ ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఎంతమంది నాయకులు కలిసి వస్తారో చెప్పేలేం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులతో మాట్లాడారు. ప్రజల మద్దతు కూడగట్టడం కోసం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. అంటే ఆదిలోనే హంసపాదు పడిందన్నమాట. ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. 

ఇక రైతుల రుణమాఫీ కి సంబంధించిన 25 వేల కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులపై, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని రేవంత్ రెడ్డి ఎన్నో వ్యూహాలు రచిస్తున్నా ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా దానికి తగినట్టుగా ప్రతిఫలం రావడం లేదన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మన మునుగోడు మన కాంగ్రెస్ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు ఫెయిల్యూర్ కు కారణంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి, వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీజేపీ బలోపేతం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలో సమన్వయం లేకుండా ఇలా ఎన్ని ఆందోళన కార్యక్రమాలు ప్లాన్ చేసినా వృథాయే.