బాదుడుపై రోజా ఏక‌రువు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. బాబు పాల‌న‌లోని చీక‌టి రోజుల్ని ఆమె గుర్తు చేశారు. సీఎంగా చంద్ర‌బాబు బాదుడు గురించి రోజా ఏక‌రువు పెట్టారు. ఇవాళ తిరుప‌తిలో ఆమె మీడియాతో…

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. బాబు పాల‌న‌లోని చీక‌టి రోజుల్ని ఆమె గుర్తు చేశారు. సీఎంగా చంద్ర‌బాబు బాదుడు గురించి రోజా ఏక‌రువు పెట్టారు. ఇవాళ తిరుప‌తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నాడు బాదుడే బాదుడంటూ వ్యాట్‌, విద్యుత్ చార్జీల‌ను చంద్ర‌బాబు పెంచ‌లేదా? అని నిల‌దీశారు. చంద్ర‌బాబు పాల‌న‌లో న‌ర‌కాసుర‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా త‌ల‌పించింద‌ని దెప్పి పొడిచారు.

జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. బాబు, జ‌గ‌న్ పాల‌న‌ను పోల్చి చెప్పారామె. ఆర్టీసీని ప్రైవేట్‌ప‌రం చేయాల‌ని చంద్ర‌బాబు చూశార‌న్నారు. కానీ జ‌గ‌న్ మాత్రం ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసి వారి ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చార‌ని కొనియాడారు. ఢిస్కంల‌కు చంద్ర‌బాబు హ‌యాంలో రూ.28 వేల కోట్లు బ‌కాయిలు పెట్టార‌ని గుర్తు చేశారు. చంద్ర‌బాబు పాల‌న‌లో విద్యుత్ చార్జీల‌ను పెంచార‌ని విమ‌ర్శించారు.

గత ప్రభుత్వం హయాంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్  చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని రోజా త‌ప్పు ప‌ట్టారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో  విద్యా, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించిన‌ట్టు రోజా చెప్పుకొచ్చారు. రూ.1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయార‌న్నారు. 

వాటిని త‌మ ముఖ్య‌మంత్రి జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నారని చెప్పారు. గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్‌గా అనిపించింది కాబట్టే చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారని తెలిపారు.

మహిళల రక్షణ విష‌యంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఇదిలా వుండ‌గా గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ ఉద్య‌మంపై చంద్ర‌బాబు ఉక్కుపాదం మోపిన సంగ‌తి తెలిసిందే. బ‌షీర్‌బాగ్‌లో పోలీసుల కాల్పుల్లో ఉద్య‌మ‌కారులు ప్రాణాలు కోల్పోయారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఇదొక మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలింది.