తనను డైమండ్ పాప అని వెటకరించిన లోకేశ్‌పై మంత్రి ఆర్కే రోజా మరోసారి మండిపడ్డారు. లోకేశ్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను విమర్శించడానికి రోజా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇవాళ వైసీపీ కార్యకర్తల సమావేశంలో రోజా మాట్లాడుతూ తనదైన స్టైల్‌లో లోకేశ్ పాదయాత్రపై సెటైర్స్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను లోకేశ్ విమర్శించడాన్ని ఆమె తప్పు పట్టారు.
తెలుగుదేశం వాళ్లు జనంలోకి వచ్చే ధైర్యం లేక, ప్రెస్‌మీట్లు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ నాయకులనో, ముఖ్యమంత్రినో విమర్శిస్తే మాత్రం వాళ్లకి మర్యాద వుండదని మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో తిరగాలని అనుకున్నా, తిరిగే పరిస్థితి వుండదన్నారు. గతంలో చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఎందుకు ఏమీ చేయలేదో, అలాగే వైఎస్సార్, వైఎస్ జగన్‌లు సీఎంగా ఎందుకు బాగా చేశారో, చేస్తున్నారో గృహసారథులు వివరిస్తే టీడీపీ వారికి పరక దెబ్బలే కాదు, చాట దెబ్బలు కూడా పడతాయని రోజా హెచ్చరించారు.
లోకేశ్ నోరు అదుపులో పెట్టుకో అని రోజా హెచ్చరించారు. కనీసం అరకిలోమీటర్ సక్రమంగా నడవలేక వంకరటింకర్లు పోయే లోకేశ్ కూడా 3,600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుందన్నారు. గతంలో సంక్షేమ పథకాలను, సచివాలయ వ్యవస్థను విమర్శించిన టీడీపీ, ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి ప్లేట్ పిరాయించారని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లను కొనసాగిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని రోజా తప్పు పట్టారు. ప్రజలు మాత్రం జగన్ తీసుకొచ్చిన వాటిని కొనసాగించడానికి మీరెందుకు, ఆయన్నే సీఎంగా మళ్లీ ఎన్నుకుంటామని చెబుతున్నారన్నారు.