ఎదుటివాళ్ల కాళ్ల బురద ను ఎత్తి చూపేముందు మన కాళ్ల ఎంత శుభ్రంగా వున్నాయో చూసుకోవాలి. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కు పాపం అస్సలు ఇది పట్టదు.
ఎంతసేపూ ప్రపంచం మొత్తం మీద ఆయనకు జగన్ ఒక్కడే విరొధి. ఇది జగన్ పాలన చూసిన తరువాత పుట్టిన బుద్ది అంటే ఏమో అనుకోవచ్చు. 2014 నుంచి కూడా జగన్ అంటే కిట్టదు. అది ఆజన్మ విరొధం లాంటిది. మరి అది ఎందుకు పుట్టిందో పవన్ కే తెలియాలి. తనకన్నా వయసులో చిన్నవాడు అందలం ఎక్కేసాడు, తనకు దక్కలేదనే బాధేమో మరి. తెలియదు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆంద్ర పేరు అప్పుల కారణంగా మారుమోగిపోతోందని, జగన్ మీద సెటైర్ల మీద సెటైర్లు వేసారు పవన్. కానీ ఇలా ఆంద్ర అప్పుల గురించి మాట్లాడే ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల అప్పుల వైపు ఓసారి తొంగి చూస్తే బాగుండేది. చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల గురించి కూడా మాట్లాడి వుంటే ఇంకా బాగుండేది. కానీ అలా మాట్లాడితే కిట్టని జనం పవన్ కు ప్యాకేజ్ స్టార్ అని ఎందుకు పేరు పెడతారు.
సోషల్ మీడియాలో మేధావులు అంతా ఓ విషయమై ఆందోళన చెందారు. అది పవన్ దృష్టికి వచ్చి వుండదు. వచ్చినా పట్టించుకోరు. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రం చేస్తున్న అప్పులు, వడ్డీలు ఏ మేరకు వున్నాయి అన్నది ఈ సమాచారం. కేంద్రం వ్యవహారం ఎందుకు అంటే పవన్ సదా ‘జీ’..’జీ’ అంటూ గౌరవప్రదంగా సాగిలపడి, ప్రస్తుతించి, పొత్తు పెట్టుకున్నది ఈ కేంద్రంలోని భాజపాతోనే కదా.
2023-34 యూనియన్ అంటే కేంద్ర బడ్జెట్ చెప్పిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రోజుకు 4,227 అంటే రోజుకు అక్షరాలా నాలుగువేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అప్పు తెస్తోంది. అలాగే అప్పుల కు వడ్డీల రూపంలో మీద రోజుకు 2,958 అంటే అక్షరాలా రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు చెల్లిస్తోంది.
ఇప్పుడు చెప్పండి పవన్ జీ…ఆంధ్ర ప్రదేశ్ పేరు మారుమోగుతోందా? అప్పుల కారణంగా. అలాగే జగన్ ఆస్తులు పెరుగుతున్నాయా? మరి కేంద్రం అన్ని వేలకు వేల అప్పులు రోజుల లెక్కనే చేస్తుంటే అక్కడ ఎవరి ఆస్తులు ఏ మేరకు పెరుగుతున్నాయో కూడా పవన్ తన హిందీ భాషా కౌశలం అంతా వాడి..జీ..జీ అంటూ గౌరవంగా చెప్పవచ్చు కదా?