కమెడియన్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బాబుమోహన్ బూతు పురాణం ఆడియో మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీతో కలిసి పని చేస్తానని అడిగిన కార్యకర్తను రాయడానికి వీల్లేని విధంగా బాబు మోహన్ బూతులు తిట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యకర్తలకు విలువ ఇవ్వని బాబుమోహన్ నాయకుడు ఎలా అయ్యాడనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని దూకుడు మీద ఉన్న బీజేపీ… తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న విలువ ఏంటో బాబు మోహన్ బూతులే నిదర్శనమని ప్రత్యర్థులు వ్యంగ్య కామెంట్స్ చేస్తున్నారు.
అందోల్ నియోజక వర్గం నుంచి బాబుమోహన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. రాజకీయంగా కలిసి రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీ సీనియర్ నేత. ఆదోల్‌కు చెందిన వెంకటరమణ అనే బీజేపీ కార్యకర్త బాబుమోహన్‌కు ఫోన్ చేశాడు. “సార్ మీతో కలిసి పార్టీ కోసం పనిచేద్దామని అనుకుంటున్నా” అని ఆశగా చెప్పాడు. కలిసి పని చేస్తానని చెప్పడమే కార్యకర్త నేరమైంది.
అప్పుడు బాబుమోహన్‌లో ఉండే అహంకారం బయటికొచ్చింది. “నువ్వెంత, నీ బతుకెంత? ఇంకోసారి ఫోన్ చేశావంటే చెప్పుతో కొడతా” అని రెచ్చిపోయారు. ఆ కార్యకర్తను తిట్టన బూతుల గురించి చెప్పుకుంటే… ఈ మాటలు చాలా మర్యాదకరమైనవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనిలో పనిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కూడా వదిలిపెట్టలేదు.
బండి సంజయ్ ఎవడ్రా వాడు..నా తమ్ముడు అన్నారు. తనది ప్రపంచ స్థాయి అని, నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని కార్యకర్తకు హితవు చెప్పారు. అంతర్జాతీయ స్థాయి కలిగిన తనతో కలిసి పని చేస్తానని ఓ సామాన్య కార్యకర్త అనడం ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. కార్యకర్తపై యథేచ్ఛగా బూతులు ప్రయోగించారాయన. కార్యకర్తని అవమానించిన బాబుమోహన్‌పై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.