సామాన్య ప్రజలకంటే రాజకీయ నాయకులకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. డబ్బు కూడా ఎక్కువగా (అక్రమమో, సక్రమమో) ఉంటుంది కాబట్టి బాగా డబ్బు ఖర్చుపెట్టి భారీగా పూజలు చేస్తారు. పుణ్యక్షత్రాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. హుండీల్లో డబ్బులు వేస్తారు. భక్తి అనేది వ్యక్తిగతమైనా దాన్ని ఆర్భాటంగా ప్రదర్శిస్తారు. ఫైర్ బ్రాండ్ ఏపీ మంత్రి, మాజీ హీరోయిన్ రోజా ఈమధ్య ఆధ్మాత్మిక టూర్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేవాలయాలను సందర్శిస్తున్నారు.
సామాన్యులు కావొచ్చు, పొలిటికల్ లీడర్లు కావొచ్చు దేవాలయాలకు ఊరికే పోరు, ఊరికే మొక్కులు మొక్కరు. యేవో కోరికలు కోరుకుంటారు లేదా కష్టాలు తీరాలని వేడుకుంటారు. ఎక్కువమంది నాయకులకు ఆర్ధిక కష్టాలు అంతగా ఉండవు. రాజకీయ కష్టాలే ఉంటాయి. అవి తీరాలని, రాజకీయంగా తమకు ఎదురు లేకుండా ఉండాలని దేవుడిని కోరుకుంటారు.
రోజా మామూలు రాజకీయ నాయకురాలు కాదు కదా. మంత్రి కూడా. ఆమెకూ అనేక రాజకీయ కష్టాలు ఉన్నాయి. కాబట్టి అవి తీరి తాను ప్రశాంతంగా ఉండాలని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నదేమో. ఆమె వరుసగా తమిళనాడు – ఏపీలోని ప్రముఖ దేవాలయాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో మొక్కులు అన్నీ తీర్చేసుకుంటున్నారు. తాజాగా.. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆడికృత్తికను పురస్కరించుకొని పుష్ప కావడిలతో తన మొక్కు తీర్చుకున్నారు.
ఎక్కువగా తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకొనే మంత్రి రోజా..కొద్ది రోజుల క్రితం కొల్హాపూర్ లో మహాలక్ష్మీ అమ్మవారిని సైతం దర్శించుకున్నారు. 18 శక్తీ పీఠాల్లో ఒకటిగా చెప్పుకొనే ఈ పీఠం శక్తిమంతమైంది అంటారు. అనూహ్యంగా మంత్రిగా అవకాశం దక్కించుకున్న రోజా.. ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాలు సందర్శించటం ప్రజలకు ఆసక్తికరంగా మారింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ తొలి కేబినెట్ లో చోటు దక్కనందుకు రోజా కొంత అసంతృప్తిగా ఫీలైనా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేయడంలో మాత్రం ఆమె స్పీడ్ తగ్గించలేదు. అయితే విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడే రోజాకు సొంత పార్టీ నుంచే కష్టాలు వస్తున్నాయి. నగరి నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా బలమైన వర్గం ఉంది. గతంలో ఆమెను ముప్పు తిప్పలు పెట్టారు. అయితే రోజా మంత్రి కావడంతో అంతా సర్దుకుంటుందని భావించారు. కాని రోజా మంత్రి అయినా ఆమె వ్యతిరేక వర్గం నేతలు మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.
తన సొంత నియోజకవర్గమైన నగరిలో మంత్రి రోజాకు రోజురోజుకు అసమ్మతి సెగ పెరిగిపోతోంది. సీనియర్ నేత, శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్, ఆయన భార్య ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి తదితరులతో రోజాకు విభేదాలు మరింత ముదురుతున్నాయి.
రోజాను పట్టించుకోకుండా వీళ్లు నగరి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసమ్మతి నేతలపై పలుసార్లు సీఎం జగన్ కు రోజా ఫిర్యాదు చేసినా వాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. అసమ్మతి నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉండటంతో ఎవరూ ఏమి చేయలేకపోతున్నారనే టాక్ ఉంది.
మంత్రిగా ఉన్న రోజా.. సొంత పార్టీ నేతలపై ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం ఈసలాపురం పరిధిలో ఉన్న కొత్త క్వారీల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. రోజాకు తెలియకుండానే ఆమెకు వ్యతిరేకంగా ఉండే నేతలే వీటిని ప్రారంభించారు. ఈసలాపురం గ్రామం సర్వే నంబరు 6లో 750 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూములున్నాయి.
ఇందులో ఇప్పటికే నాలుగు క్వారీలు నడుస్తున్నాయి. కొత్తగా మరో ఐదు క్వారీల ఏర్పాటుకు దరఖాస్తులు వెళ్లాయి. మొత్తం పదెకరాలకు ఒక క్వారీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ అసమ్మతి నాయకులకు సీనియర్ మంత్రి అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే రోజా ఆగ్రహానికి కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా కొత్త క్వారీలకు ఎలా శ్రీకారం చుడతారని మంత్రి మండిపడుతున్నారు.
మంత్రి రోజా కూడా క్వారీల విషయమై నేరుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా కొత్త క్వారీలను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో ఆమెకు రాజకీయ టెన్షన్ తీవ్రంగా ఉంది. దైవ దర్శనం చేసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందని భావించి ఉండొచ్చు.