హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంటారన్నారు. వీడియోకి సంబంధించి ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. నివేదిక వచ్చే వరకూ ప్రత్యర్థులకు ఓపిక లేదా? అని ఆమె ప్రశ్నించారు.
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. మహిళలకు అండగా ఉంటామన్నారు. వారిని గౌరవిస్తామన్నారు. మహిళల అభివృద్ధి కోసమే పని చేస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై తప్పక చర్యలుంటాయని మాధవ్ ఎపిసోడ్‌కు సంబంధించి అభిప్రాయపడ్డారు.
ఇదే చంద్రబాబు హయాంలో నారాయణ, చైతన్య కాలేజీల్లో ఎంతో మంది విద్యార్థులు చనిపోతే కనీసం కేసు కూడా పెట్టిన దాఖలాలు లేవన్నారు. తిరుపతిలో చైతన్య కాలేజీలో ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే, ఆ పిల్లాడి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతమన్నారు. అయినా బాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రజల్లో ఉంటూ, వారి ఆదరాభిమానాలతో మంత్రి పదవి దక్కించుకున్న తానంటే టీడీపీ, జనసేన నేతలకు అసూయ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా రోజా ఎక్కడ? ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడేం మాట్లాడ్తారని ప్రశ్నిస్తుంటారన్నారు. దీన్నిబట్టి తనపై టీడీపీ, జనసేన నేతలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఇటీవల తన కొడుక్కి కారు కొనిస్తే దాన్ని సోషల్ మీడియాలో నెగెటివ్‌గా ప్రచారం చేశారని రోజా మండిపడ్డారు.
చిన్నచిన్న యాంకర్లు కూడా కార్లు కొంటున్నారన్నారు. అలాంటిది తానింత పెద్ద పొజీషన్‌లో ఉండి కారు కొనుక్కోవడం పెద్ద కథా? అని ప్రశ్నించారు. రిషికొండ ఫొటో వేసి, తనకు గిఫ్ట్‌గా కారు ఇచ్చారని అసత్య ప్రచారం చేశారన్నారు. బ్యాంక్ లోన్ తీసుకుంటే కారు కొనుక్కోవచ్చని బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లెవరైనా అర్థం చేసుకోవాలని రోజా హితవు చెప్పారు. తాను నిజాయతీగా ఉంటానని, ఎవరితోనూ మాట పడనన్నారు.