తెలంగాణలో రాజకీయాలో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో వలసలు ప్రారంభమయ్యాయి. తాము ఉంటున్న పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అన్నీ మాట్లాడుకుని జంప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి వలసల తాకిడి పెరిగింది. మరోవైపు టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయే వాళ్లు ఎక్కుగానే కనిపిస్తున్నారు.
తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. కొంత కాలంగా ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఆ రోజు రానే వచ్చింది. ప్రదీప్‌రావు మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితుల్ని వివరించారు. ప్రజలకు కనీసం ఏమీ చేయలేకపోతున్నట్టు ఆవేదన చెందారు. తొమ్మిదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నా గుర్తించలేదని, అలాంటప్పుడు తాను టీఆర్ఎస్‌లో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
తనను అసభ్యంగా మాట్లాడుతున్నారని, వాటి గురించి చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. వరంగల్ తూర్పు సీటు ఇస్తామని చెప్పి రెండుసార్లు రిక్తహస్తం చూపారన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. కనీసం పార్టీలో కూడా అవకాశాలు ఇవ్వలేదన్నారు.
పార్టీలో అవమానాలు జరిగినా ఓపికతో భరించామన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టించే పరిస్థితులు వచ్చాయ న్నారు. అయినా అధిష్ఠానం స్పందించలేదన్నారు. ఇంకా ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలతో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తానని ప్రదీప్‌రావు తెలిపారు. తనను, కార్యకర్తల్ని ఆదరించి, మంచి అవకాశాలు కల్పించే పార్టీలో చేరుతామని ఆయన అన్నారు.