ఏపీ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కత్తి వేలాడుతోంది. ఇప్పటికే కొన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఇతర శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ కొలువు ఎప్పుడు ఊడుతుందో అనే భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు.
ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో తాజా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుకే ఎసరు పెట్టారని వారు వాపోతున్నారు. ఉద్యోగుల్లో వ్యతిరేకతను పసిగట్టిన జగన్ సర్కార్… వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారనడంలో వాస్తవం లేదన్నారు. మరోవైపు పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారని, దీనిపై సీఎం జగన్ తీవ్రంగా కోప్పడ్డారని చెప్పుకొచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగింపు ఉత్తర్వులపై విచారణ చేస్తామన్నారు.
ఒకవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రచారంలో వాస్తవం లేదంటూనే , మరోవైపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పడం ఏంటి? పైగా తొలగింపు ఉత్తర్వులపై విచారణ చేపడుతామని ఆయన అనడం విడ్డూరంగా వుంది.
ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరు తొలగిస్తున్నారు? మరి వైసీపీ పెద్దలు ఏం చేస్తున్నట్టు? పరిపాలన ఎవరు చేస్తున్నట్టు? పాలనలో ఏంటీ గందరగోళం? వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకున్నారని అనుకోవాలా? మొత్తానికి పరిపాలనలో సమన్వయం కొరవడిందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చెప్పకనే చెబుతోంది.