రాయలసీమ న్యాయ రాజధానికి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మద్దతు అవసరం లేదా? అంటే… లేదనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోంది. ఇవాళ కర్నూలులో వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో సీమ గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో కేవలం రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొనడం గమనార్హం. దీంతో సీమకు ఇతర ప్రాంతాల మద్దతు అవసరం లేదా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
ఇదే విశాఖ గర్జన సభకు మాత్రం అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు హాజరై తమ పూర్తి మద్దతు తెలిపారు. విశాఖలో నిర్వహించిన గర్జన సభకు రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన నేతలు మద్దతు ఇచ్చారు. వారిలో మంత్రులు ఆర్కే రోజా, విడదల రజినీ, మేరుగ నాగార్జున, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఉన్నారు.
మరి రాయలసీమ గడ్డ కర్నూలులో నిర్వహించిన గర్జన సభకు ఇతర ప్రాంతాల నేతలెవరూ హాజరు కాకపోవడాన్ని ఎలా చూడాలి? ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రకు చెందిన మంత్రులు, కీలక నేతలు హాజరై సంఘీభావం ప్రకటించి వుంటే… న్యాయ రాజధానికి మరింత బలం కలిగేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అలా జరగలేదు.
పూర్తిగా సీమ ప్రాంత నాయకులే హాజరై తమ ఆకాంక్షలను వెల్లడించారు. సీమ గర్జన సభను ఓ పథకం ప్రకారం నిర్వహించలేదన్న విమర్శ వుంది.