ఎన్నికలకు ఏడాది గడువు వుండగానే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలకు చాలా ముందుగానే మొదటి మేనిఫెస్టో కూడా విడుదల చేయడం గమనార్హం. సీఎం జగన్ మాదిరిగానే చంద్రబాబు కూడా సంక్షేమ బాట పడుతున్నట్టు పథకాలను ప్రకటించారు. వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనను నేటితో పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటోంది.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో వైఎస్ జగన్ చేసి చూపించారని అన్నారు. సమ సమాజాన్ని నిర్మించే పనిలో వైఎస్ జగన్ ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగేళ్లలో జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి కొన్ని గుంట నక్కలు తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు.
జనాల్ని మోసగించడానికి చంద్రబాబు మళ్లీ వస్తున్నాడని తప్పు పట్టారు. దత్తపుత్రుడితో కలిసి ఎన్నికలకు పోవాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ఏం చేశారో ప్రజలు మరిచిపోలేదన్నారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. తన హయాంలో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు అమ్మ ఒడిని కాపీ కొట్టి.. అమ్మకు వందనం పేరుతో వస్తానంటున్నాడని వెటకరించారు. చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరన్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసన్నారు. కానీ అబద్దాల హోరులో ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు. దొంగదెబ్బ తీసి పార్టీని ఆక్రమించిన చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తాడని అనుకోవద్దని విన్నవించారు.
పొత్తులతో పాచికలు వేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఏపీ ప్రజలే కాదు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని సజ్జల చెప్పారు.