రాష్ట్రాలు వేర్వేరు. ఒకే భాష. అది తెలుగు భాష, యాస వేరు. నిన్నమొన్నటి వరకూ అందరం కలిసి ఉన్నవాళ్లమే. రాష్ట్ర విభజన పుణ్యమా అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయాం. రాజకీయాల తీరు మాత్రం మారలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే… సేమ్ టు సేమ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తామే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో బీజేపీ సమరోత్సాహంతో ఎన్నికలకు వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టడం అక్కడి అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఏ మాత్రం నచ్చడం లేదు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు టీఆర్ఎస్ కొత్త ఎత్తులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. న్యాయ పోరాటం చేసిన బీజేపీ పాదయాత్రకు సానుకూల తీర్పు పొందింది. దీంతో మళ్లీ ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ శ్రేణులు నేరుగా వెళ్లి అడ్డు తగలడం మారిన రాజకీయ పరిస్థితులకు ప్రతీకగా చెప్పుకొవచ్చు. అనవసరంగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది.
మరోవైపు కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఇంచుమించు ఇవే రకమైన పరిస్థితులు. మొదటి రెండు రోజులు వైసీపీ శ్రేణులు అడ్డు తగిలినట్టు చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇవాళ మూడోరోజు ఆయన పర్యటన ప్రశాంతంగా సాగుతోంది. తెలంగాణలో బండి సంజయ్‌కి, ఆంధ్రాలో చంద్రబాబుకు భద్రత పెంచడం అక్కడి రాజకీయ వేడిని ప్రతిబింబిస్తోంది.
ఏది ఏమైనా రాజకీయాల్లో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవడంపై ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది మంచి సంప్రదాయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.