తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా బండి సంజయ్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం గమనార్హం. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పాదయాత్ర అనుమతితో మూడు రోజుల తర్వాత బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బయల్దేరారు.
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం కూనూర్ దగ్గర పాదయాత్రను అధికార పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినదించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు తమ నాయకుడికి మద్దతుగా టీఆర్ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తలపై లాఠీచార్జీ చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
బండి సంజయ్ పాదయాత్ర చేస్తే టీఆర్ఎస్కు భయం ఎందుకని బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పాదయాత్ర జరుగుతుంటే అధికార పార్టీ అలజడి సృష్టిస్తోందని వాపోయారు.
టీఆర్ఎస్ అధిష్టానం, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పాదయాత్రకు అడ్డు తగులుతున్నారని బీజేపీ భావిస్తోంది. దీంతో స్వీయరక్షణ ఏర్పాటులో బీజేపీ వుంది. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు అడ్డు తగులుతున్న నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.