ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను మార్చినట్టు పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులను జాతీయ నాయకత్వం మార్పు చేసినట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌లను నియమించినట్టు తెలిసింది. ఇక అధికారిక ప్రకటనే వెలువడాల్సి వుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముంగిట బీజేపీలో కీలక పరిణామాలుగా చెప్పొచ్చు.
ప్రధానంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ నియామకం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈయన కడప జిల్లా నివాసి. ప్రొద్దుటూరు స్వస్థలం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యతిరేకిగా గుర్తింపు పొందారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సమీప బంధువు. వెంకయ్యనాయుడి వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి.
మంచి లాబీయిస్ట్‌గా పేరు పొందారు. అలాగే రాజకీయంగా టీడీపీ అనుకూల పంథాలో నడుస్తుంటారని బీజేపీలోని కొందరు అంటుంటారు. సత్యకుమార్‌ను ఏపీ బీజేపీ చీఫ్ చేయడం అంటే, టీడీపీ నాయకుడిని రథసారధి చేసినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, ఏనాడూ ఆ పార్టీపై ఒక్క విమర్శ కూడా చేయకపోవడంతో టీడీపీ బ్యాచ్‌లో ఒకడిగా భావిస్తారు. ఏపీ బీజేపీ ఒక ఎల్లో మీడియాను బహిష్కరించినా, సత్యకుమార్ కాలమ్ మాత్రం యధావిధిగా ప్రచురితం అవుతుండడంతో, టీడీపీ మనిషనే ఆరోపణలకు బలం కలిగిస్తున్నాయి.
అయితే ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన వ్యవహారశైలి ఎలా వుంటుందనే చర్చకు తెరలేచింది. సోము వీర్రాజును తొలగించడం, సత్యకుమార్‌ను నియమిస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఇదే సత్యకుమార్ బీజేపీ కోసం పని చేస్తారనే వాదనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలం అన్నింటికి జవాబు చెబుతుంది.