అన్నింటికీ తెగించిన తర్వాతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన మనసులోని ఆక్రోశాన్ని బయటపెట్టారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు కళ్ళు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌ను మళ్లీ గెలిపిస్తానని హామీ ఇచ్చిన అమిత్ షాకు ఆ పని చేతకాలేదని విమర్శించారు.
తనకు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి కావాలంటే, ఆ పదవి ఖాళీగా ఉన్నదని తెలిసినా ఇప్పించ లేకపోయిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసమర్థతను నిలదీశారు.
పార్టీకి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడనేలేదని అంటున్న రఘునందన్ రావు.. ఇంతకంటే ఇంకేం నష్టం చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, వారిద్దరిని మించిన హోం మంత్రి మీద ఆయన చాలా పదునైన విమర్శనాస్త్రాలను సంధించారు. ఇప్పుడు రఘునందన్ రావు వ్యాఖ్యల మీద పార్టీ హై కమాండ్ సీరియస్ అవుతున్నదని వార్తలు వస్తున్నాయి.
మీడియాతో చిట్ చాట్ రూపంలో రఘునందన్ మాట్లాడిన మాటలను అనువాదం చేయించి హై కమాండ్ కు రాష్ట్ర నాయకులు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన మాటలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన మీద చర్య తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు. వీటిని హై కమాండ్ కూడా సీరియస్ గానే పరిగణిస్తున్నదని నేడో రేపో నిర్ణయం కూడా వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో రఘునందన్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే వాదన కూడా పార్టీలో ఉంది. ఆయన ఆశీస్సులతోనే ఇంత దూకుడుగా మాట్లాడినట్లుగా కూడా కొందరు చెబుతున్నారు.
ఏదేమైనప్పటికీ.. పార్టీలో తనను కొనసాగించినా బహిష్కరించినా అన్ని రకాల పరిణామాలకు సిద్ధపడే, తెగింపుతోనే రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలను చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. తెగించిన వాడు రాజు కంటే బలవంతుడు అనే సామెత మనకు ఉండనే ఉంది. అలాగే రఘునందన్ రావు ‘‘దుబ్బాకలో గెలిచినది బిజెపి కాదు, తాను’’ అని చెప్పుకుంటూ, సొంతంగా నిలబడినా సరే తాను మళ్ళీ గెలవగలనని సంకేతాలు ఇస్తూ పార్టీకి హెచ్చరికలు పంపారు.
అమిత్ షా మీదనే విమర్శలు చేయడం అంటే బాగా తెగించినట్లే లెక్క. తెగించిన వాడి మీద ఏ చర్యలు తీసుకుని ఏ మాత్రం భయపెట్టగలరు? పార్టీకి ఒక ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంటే ఆయనకు నోటీసు ఇచ్చి అంతటితో మిన్నకుండి పోవాలి. బహిష్కరించదలచుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా తొందరగా తేల్చాలి. లేకపోతే ఒక్కొక్కరు ఇలాగే మాట్లాడుతూ పార్టీ పరువును మరింత బజారున పడేసే ప్రమాదం ఉంటుంది.