సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మృతి

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సీహెచ్ఎంవీ కృష్ణారావు (64) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు. హైద‌రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శాశ్వ‌తంగా లోకాన్ని వీడారు. జ‌ర్న‌లిస్ట్‌గా తెలుగు,…

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సీహెచ్ఎంవీ కృష్ణారావు (64) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు. హైద‌రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శాశ్వ‌తంగా లోకాన్ని వీడారు. జ‌ర్న‌లిస్ట్‌గా తెలుగు, ఇంగ్లీష్ మీడియా సంస్థ‌ల్లో ఆయ‌న ప‌ని చేశారు.

స‌మాజం ప‌ట్ల లోతైన అధ్య‌య‌నం, అనేక రంగాల‌పై విశేష ప‌రిజ్ఞానం క‌లిగిన జ‌ర్న‌లిస్ట్‌గా గౌర‌వం పొందారు. రాజ‌కీయ విశ్లేష‌కుడిగా అన్ని చాన‌ళ్ల‌లో పాల్గొంటూ నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించేవారు. అందుకే ఆయ‌న్ను రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ గౌర‌వించేవారు. రాజ‌కీయ‌, జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో ఆయ‌న్ను అభిమానంతో అంద‌రూ బాబాయ్‌గా పిలిచేవారు.

కృష్ణారావు మృతిపై ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న మృతిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

“తెలుగు, ఇంగ్లీష్ జ‌ర్న‌లిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. జ‌ర్న‌లిస్ట్‌గా కిందిస్థాయి నుంచి ఉన్న‌త‌స్థాయికి ఎదిగిన వ్య‌క్తి కృష్ణారావు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి” అని వైఎస్ జ‌గ‌న్ సంతాప ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. జ‌గ‌న్‌తో పాటు ఏపీ మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు, ఏపీ ప్ర‌భుత్వ జాతీయ మీడియా స‌ల‌హాదారు దేవుల‌ప‌ల్లి అమ‌ర్ త‌దిత‌రులు కృష్ణారావు మృతికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.