ఏం మాట్లాడినా.. ఒక సున్నితత్వం అంటూ లేకుండా మాట్లాడటం, ఇదీ వైఎస్ షర్మిల లేదా మొరుసుపల్లి షర్మిల మాటల్లోని ప్రధాన లోపం! తెలంగాణ రాజకీయంలో ఇలా మాట్లాడే షర్మిల పరువు పోగొట్టుకున్నారు! ట్రోల్ పేజీలకు అప్పట్లో షర్మిల చాలా మెటీరియల్ అందించారు! సినిమాల్లో కూడా షర్మిల మాటలను కామెడీగా వాడేసుకోవడం కూడా ఇప్పటికే జరిగిపోయిన ముచ్చట!
తెలంగాణలో ఆమె చేయని యాగీ లేదు! సోనియాగాంధీని తిట్టారు, కాంగ్రెస్ ను తిట్టారు, కేసీఆర్ ను తిట్టారు, బీజేపీని తిట్టారు, రేవంత్ ను తిట్టారు.. అన్నీ అయిపోయాయి! ఎవరిని తిట్టినా.. కాస్తైనా డిప్లొమాటిక్ గా అయినా మాట్లాడారా? అంటే.. అలాంటిదేమీ లేదు! లేకి భాషతో షర్మిల అప్పట్లో అందరినీ తెగ తిట్టారు! పోలీసులపై చేయి చేసుకునేంత వరకూ వెళ్లారు! షర్మిల నోటి దురుసుకు అప్పట్లో ఒక పోలీసాఫీసర్ ఇచ్చిన సమాధానం చాలు ఆమె తన తీరును సరిచేసుకోవాలనుకుని అర్థం చేసుకోవడానికి!
అయితే షర్మిల ఎంత లేకిగా వ్యవహరించాలో అంతా చేసి.. తెలంగాణ రాజకీయం నుంచి వైదొలిగారు! తను తెలంగాణ కోడలన్నారు, ఏదేదో అన్నారు! ఇప్పుడు మళ్లీ రాజన్న బిడ్డనంటూ కడపలో తిరుగుతున్నారు! ఇలా తెలంగాణతో మొదలుపెట్టి.. ఏపీ వరకూ ఆమె రావడమే పెద్ద ప్రహసనం! అప్పుడే షర్మిల చూసే వాళ్లకు కూడా చులకన అయ్యారు!
ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని ఆమె అతిగా ఉపయోగించేసుకుంటున్న తీరును చూస్తే.. మరీ ఇలానా! అనుకుంటూ నవ్వుకునే పరిస్థితే ఏర్పడింది. వివేకను అవినాష్ రెడ్డి హత్య చేశాడంటూ షర్మిల వీధికెక్కి అరుస్తున్నారు! కోర్టు విచారణలో ఉన్న ఒక కేసు గురించి.. ఇలా మాట్లాడొచ్చా? అనేది ఎవరికైనా సహజంగా వచ్చే అనుమానం!
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. నిందితుడు, దోషి.. అనే పదాల్లో చాలా వ్యత్యాసం ఉంది! నిజంగానే వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి దగ్గరుండి తెగనరికినా.. అది చట్టపరంగా రుజువు అయ్యే వరకూ అతడిని నిందించే హక్కు ఎవ్వరికీ ఉండదు. అందునా.. కోర్టులో ఉన్న, సీబీఐ విచారణ జరుగుతున్న కేసు గురించి తనేదో దగ్గరుండి చూసినట్టుగా షర్మిల మాట్లాడుతున్నారు! ఆడ బిడ్డ అంటే ఆడబిడ్డ కాబట్టి, పాద యాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అంటూ.. షర్మిల ఎలా కామెడీ అయ్యిందో, వివేక హత్యోదంతంపై కూడా తోచినట్టుగా మాట్లాడుతూ.. అంతే స్థాయిలో నవ్వుల పాలవుతున్నారు!
తన రాజకీయ దిగజారుడు తనంలో షర్మిల ఇప్పటి వరకూ జారిన మెట్లన్నింటి కన్నా.. కడప కాంగ్రెస్ అభ్యర్థిగా తీవ్ర పతనావస్థలో కూరుకుపోతున్నారని మాత్రం స్పష్టం అవుతోంది. ఈమె ఇంతలా ప్రచారం చేసి.. రేపు ఈమెకు అక్కడ డిపాజిట్ కూడా దక్కకపోతే.. ఆ తర్వాత జనాలకు ఎలా మొహం చూపించుకుంటోందో! అయినా తెలంగాణలో అంత రచ్చ చేసి ఇప్పుడు ఏపీలో ఇన్ని మాటలు చెప్పడానికి మొహమాట పడని షర్మిలకు ..అలాంటి వన్నీ ఒక లెక్కనా!