ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా వైఎస్ షర్మిల నియామకంపై ఎల్లో మీడియా రాతలు చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇక అన్నపై విమర్శలు దాడి చేయడానికి షర్మిల వస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. అంటే వైసీపీని మాత్రమే కాంగ్రెస్ పార్టీ, దాని నూతన సారథి షర్మిల ప్రత్యర్థిగా భావిస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలకు షర్మిల స్నేహితురాలని చెప్పదలుచుకున్నారా? ఇలాంటి రాతలతో ఎవరికి ప్రయోజనం? జగన్‌ను ఎదుర్కోలేక అందరూ ఒక్కటవుతున్నారనే భావన ప్రజల్లో ఏర్పడితే నష్టమెవరికి?… ఈ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు? అనేదే ప్రశ్న.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ, జనసేన మధ్య కూడా పొత్తు ఉందనే మాటే తప్ప, ఎన్నికలు దగ్గర పడుతున్నా ఆ రెండు పార్టీలు కలిసిన దాఖలాలు లేవు. టీడీపీ, జనసేనలతో పొత్తు విషయమై ఇంత వరకూ జాతీయ బీజేపీ ఏమీ తేల్చలేదు. ఆ రెండు పార్టీలతో పొత్తు తేల్చే బాధ్యతను జాతీయ నాయకత్వానికి అప్పగిస్తూ ఇటీవల ఏపీ బీజేపీ తీర్మానం చేసింది.
గతానుభవాల దృష్ట్యా టీడీపీతో పొత్తు అంటే ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా భయపడుతున్నారని సమాచారం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎప్పటికీ సొంతంగా ఎదగలేమనేది బీజేపీ ఆందోళన. కేవలం జనసేనతో మాత్రమే కలిసి వెళ్లాలని బీజేపీ ఆసక్తి చూపుతోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం మోదీ, అమిత్‌షా, నడ్డాలపై ప్రేమ మాటలు చెబుతూ, చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకుని చాలా కాలం నుంచే తిరుగుతున్నారు. ఇప్పుడు ఏకంగా అధికారికంగా పొత్తు పెట్టుకున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వామపక్షాలు, ఆప్‌లతో పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరుపుతున్నారు. ఏపీలో ఇదీ రాజకీయ చిత్రం. ఇవన్నీ పక్కన పెట్టి, అన్నపై రాజకీయ దాడికి షర్మిల సిద్ధమంటూ ప్రచారం చేయడం ద్వారా ఏం ఆశిస్తున్నారో వారికే తెలియాలి.