షర్మిల అతి.. జగన్ కు మేలు చేస్తుందా?

వైఎస్ షర్మిల తనకు పగ్గాలు దక్కిన వెంటనే కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ఇచ్ఛాపురం నుంచి యాత్ర కూడా మొదలెట్టారు. అచ్చంగా ఎన్నికలు వచ్చేసిన స్థాయిలో స్టంట్లు రక్తి కట్టిస్తున్నారు. మధ్యలో బస్సు ప్రయాణం వంటి గిమ్మిక్కులు…

వైఎస్ షర్మిల తనకు పగ్గాలు దక్కిన వెంటనే కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ఇచ్ఛాపురం నుంచి యాత్ర కూడా మొదలెట్టారు. అచ్చంగా ఎన్నికలు వచ్చేసిన స్థాయిలో స్టంట్లు రక్తి కట్టిస్తున్నారు. మధ్యలో బస్సు ప్రయాణం వంటి గిమ్మిక్కులు బహుశా ఈ దశలో ఆమెకు అవసరమే కావొచ్చు. కానీ.. చాలా దూకుడుగా మాట్లాడే స్వభావం ఉన్న షర్మిల.. విమర్శనాస్త్రాలను సంధించడంలో కాస్త అతి చేస్తున్నారేమో అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

ఆమె అతి చేయడం ఒక ఎత్తయితే.. అన్న జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నాననే భ్రమలో, ఆయన అవకాశాలకు గండికొట్టాలనే యావలో.. షర్మిల చేస్తున్న అతి.. జగన్ కే మేలు చేసేలా పరిణమించవచ్చునని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. 

రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది జగన్ సర్కారు మీద షర్మిల వేస్తున్న ప్రధాన నింద. అభివృద్ధి ఉంటే చూపించండి.. నేను వస్తా అని ఆమె సవాలు విసురుతున్నారు. కానీ.. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ కూడా చేయని విధంగా నాతో పాటూ ప్రతిపక్ష నాయకులను కూడా తీసుకువస్తా, మేదావులను (వారెవ్వరో మరి??) కూడా తీసుకువస్తా.. చూపించండి అని ఆ సవాలుకు కూడా కండిషన్లు పెడుతున్నారు.

నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలు స్ట్రెయిట్ గా తమ నియోజకవర్గానికి రమ్మని, అభివృద్ధిని చూపిస్తామని ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ‘ప్రతిపక్షాలను కూడా తీసుకువస్తా’ అని షర్మిల చేస్తున్న సవాలును గమనిస్తేనే.. ఆమె చంద్రబాబునాయుడు గూటిచిలక గా ఈ పలుకులు పలుకుతోందని అందరికీ అర్థమవుతోంది. 

అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించడానికి షర్మిల శతథా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆమె వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని భాజపాతో సంబంధం అంటగడుతున్నారు. జగన్ సర్కారు భాజపా చేతిలో కీలుబొమ్మలా మారిపోతున్నదని ఆమె విమర్శిస్తున్నారు.

రాహుల్ ను ప్రధాని చేయడం తన లక్ష్యం అంటున్న షర్మిల, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల మన్నన చూరగొనడానికి పదేపదే ఏపీలో మనుగడలో లేని బిజెపిని కూడా పెద్ద భూతంగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే ఈ కోణంలోంచి ఆమె చేస్తున్న అతి కూడా జగన్ కు లాభిస్తుందేమో అని పలువురు అనుకుంటున్నారు. 

ఏపీలో బిజెపి పార్టీకి గెలిచేంత సత్తా లేకపోయినప్పటికీ.. వారికి కనీసం ఒక్క శాతం స్థిరమైన ఓటు బ్యాంకు రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు రామాలయం ప్రారంభం కూడా జరిగిన తర్వాత.. మోడీ పట్ల అభిమానం పెరిగిన తటస్థుల ఓటు బ్యాంకు కూడా కనీసం ఒక శాతం వరకు ఉండొచ్చు. వీరు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు. తెలుగుదేశం కూటమిలో చేరకపోతే గనుక.. బిజెపి  ఒంటరిగా పోటీచేస్తుంది. అయినా ఒక్కస్థానంలో కూడా డిపాజిట్ తెచ్చుకోలేరు. ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు. అలాంటప్పుడు.. బిజెపికి వేసి తమ ఓటు వృథా చేసుకునే బదులుగా.. బిజెపితో సత్సంబంధాలున్న జగన్ కే వేస్తే మేలు కదా అనే భావన వారిలో కలిగే అవకాశం ఉంది.

ఇలాంటి భావన పుట్టించడానికి షర్మిల మాటలు దారితీయవచ్చు  అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. స్ట్రెయిట్ గా కనిపించకపోయినా.. బిజెపికి- జగన్ కు సంబంధాన్ని అంటగడుతూ షర్మిల చేస్తున్న ప్రచారం ఎంతో కొంత జగన్ కు మేలు చేసినా ఆశ్చర్యం లేదనే వారున్నారు. జగన్ ఓట్లను షర్మిల ఏ మేరకు చీల్చగలదో తెలియదుగానీ.. ఆమె చేస్తున్న ఈ అతి వల్ల కొంత మేర లాభం తప్పదని ఊహిస్తున్నారు.