Advertisement

Advertisement


Home > Politics - Opinion

అమెరికాలో ట్రంప్ కే మనవాళ్ల ఓటు

అమెరికాలో ట్రంప్ కే మనవాళ్ల ఓటు

ఇండియాలో అధికశాతం ప్రజలు మళ్లీ మోదీయే అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా భద్రత, అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, శతాబ్దాలుగా దశాబ్దాలుగా పరిష్కారం కాని అంశాలను ఒక కొలిక్కి తీసుకురావడం.. మొదలైన కారణాల వల్ల ప్రజలు మళ్లీ సై అంటున్నారు. వాళ్ల తీర్పును ఈ 2024 ఎన్నికల్లో చెప్పబోతున్నారు. 

ఇదే 2024లో అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి భారతీయులు మొగ్గేది బైడన్ వైపా లేక ట్రంప్ వైపా అంటే..ఎక్కువశాతం మంది ట్రంప్ వైపే ఉన్నారు. 

సాధారణంగా అమెరికాలో సెటిలైపోయి అక్కడి పౌరులుగా మారిన వారు రిపబ్లికన్ పార్టీ పవర్లోకి రావాలని కోరుకుంటారని, అదే ఇంకా హెచ్ 1 మీద ఉండి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్నవారు మాత్రం డెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గు చూపుతారని ఒక బలమైన అభిప్రాయముంది. దానికి కారణం డెమోక్రటిక్ పార్టీ లిబరల్. రిపబ్లికన్ పార్టీకి జాతీయవాదం ఎక్కువ. 

ఎలా పడితే అలా వీసాలివ్వడానికి, ఎక్కువ మంది విదేశీయుల్ని దేశంలోకి అనుమతించడానికి రిపబ్లికన్ పార్టీ విముఖంగా ఉంటుంది. ఎలా పడితే అలా శరణార్ధుల్ని కూడా రానీయదు. డెమోక్రటిక్ పార్టీ దానికి భిన్నం. ప్రస్తుతం ఇబ్బడి ముబ్బడిగా పై చదువుల కోసం ఇండియన్ విద్యార్థులు అమెరికాకి పయనమయ్యారంటే దానికి కారణం ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉండడం కూడా ఒకటి. రిపబ్లికన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలు అడ్మిషన్ ఇచ్చినా అంత ఈజీగా ప్రతి విద్యార్థికి వీసా వచ్చేది కాదు. 

అయితే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ యొక్క లిబరల్ వైఖరి అన్ని వర్గాల అమెరికన్స్ కి చిరాకుగా పరిణమించింది. ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటున్నారు. దాని వల్ల లోకల్స్ కి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా రావట్లేదు. ఎందుకంటే 100 డాలర్లు ఇచ్చే చోట 10 డాలర్లకే ఈ ఇమిగ్రెంట్స్ పని చేసేస్తున్నారు. వీరి వల్ల అక్కడికి చదువు నిమిత్తం వెళ్లి ఏదైనా సైడ్ జాబ్ చేద్దామనుకునే ఇండియన్ స్టూడెంట్స్ కి కూడా ఎంత కష్టపడ్డా మునుపట్లా ఆదాయం ఉండట్లేదు. 

ఇదొక ఎత్తైతే అసలు బైడన్ పాలనలో గంజాయి లీగలైజ్ అయ్యింది. దాంతో ప్రధాన నగరాల్లో కొన్ని రోడ్లపై గుప్పుమంటున్న గంజాయి వాసన. ఏదైనా కారుని అద్దెకు తీసుకుంటే అందులో కూడా గంజాయి దుర్వాసనే. దీనివల్ల క్రైం రేట్ కూడా విపరీతంగా పెరిగింది. ఎప్పుడు ఎవడు ఏ గంజాయి మత్తులో ఏ తుపాకి పేలుస్తాడో అనే భయం. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కూడా పెరిగాయి. 

అమెరికాలో గతంలో ఉండే డీసెన్సీ, శుభ్రత, భద్రత ఇప్పుడు చాలాచోట్ల కనిపించడం లేదు. ప్రజల ఆర్ధిక, సామాజిక పరిస్థితి చూస్తే 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఏదో టెక్నాలజీ పెరగడం తప్ప ప్రజాజీవనం కొత్తగా మెరుగుపడిందనేది లేదు. 

ఇది కాక ఉన్నవాడిని దోచి లేనివాడికి పంచడమనే రాబిన్ హుడ్ సిద్ధాంతం ఫాలో అవుతోంది డెమోక్రాట్ ప్రభుత్వం. ఉదాహరణకి ఆదాయం బాగున్న దంపతులు నెలకి 2100 డాలర్స్ కట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరన్స్. వద్దంటే కుదరదు. ఒక నెల కట్టకపోయినా విపరీతమైన పెనాల్టీ. 

అదే ఇల్లు వాకిలి లేని పేదవాడికైతే ఇన్సూరెన్స్ లేని ఉచిత వైద్యమా అంటే కాదు. అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ 50 డాలర్లకిస్తున్నారు. కానీ అది కట్టడానికి కూడా పేదవాళ్లకి ఇబ్బందిగానే ఉందంటున్నారు. ఇక ఉన్నవాళ్లకి నెలకి 2100 కట్టడం దోపిడీలా ఉంది. అంటే ఏ వర్గమూ ప్రస్తుత డెమోక్రటిక్ ప్రభుత్వంతో ఈ విషయంలో సంతృప్తిగా లేరు. 

అలాగే ద్రవ్యోల్బణం చూస్తుండగానే విపరీతంగా పెరిగిపోయింది. గతంలో నిత్యావసరాలు వగైరాలు ఇండియాకి అమెరికాకి సుమారు రెండింతలు తేడా ఉండేది. ఇప్పుడు నాలుగింతలయింది. 

స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు కూడా బలంగా లేవు. 

మాల్స్ మీద పడి లూటీ చేసే యువత పెరిగింది. ఈ లూటీలకి భయపడి చాలా మాల్స్ మూతపడ్డాయి కూడా. పైగా ఇలాంటి కేసులకి పెద్ద శిక్షలు లేకపోవడం కూడా అరచకానికి ఆజ్యం పోస్తోంది. 

వలసలవల్ల పెరిగిన జనాభా, పర్యవసానంగా గందరగోళం, విపరీతంగా పెరిగిన ధరలు, పొంచి ఉన్న ఆర్ధికమాంద్యం, శాంతిభద్రతల లోపం వంటి అనేక కారణాల వల్ల అమెరికాలో అధికశాతం ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేయడానికే నిర్ణయించుకున్నారని సర్వేలు చెబుతుతున్నాయి. 

ట్రంప్ అధ్యక్షతలో స్టాక్ మార్కెట్స్ బాగుండేవి. ఉద్యోగాలుండేవి. ఆర్ధిక మాంద్యం పలకిరించినా తట్టుకుని నిలబడే విధంగా స్టిములస్ చెక్స్ లాంటివి ప్రజలకి అందాయి. జాతీయవాదంతో పరిస్థితులు స్ట్రిక్ట్ గా ఉండేవి. 

అందుకే ప్రపంచం ట్రంప్ ని రోగ్ ప్రెసిడెంట్ గా ముద్ర వేసినా కూడా ప్రజలు మాత్రం మళ్లీ అతనినే కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్నవారిలో అక్కడి పౌరులైన మనవాళ్లు కూడా ఉన్నారు. ఈ ఏడు నవంబర్ లో ఎన్నికల. ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

పద్మజ అవిర్నేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?