మరీ కామెడీగా ఉంటుందని అనుకున్నారేమో ఆ మూడో పదం మాత్రమే చెప్పలేదు ఆ నలుగురు ఎమ్మెల్యేలు! మిగిలిన డైలాగుల్ని అంతకమించి అర్థాన్ని ధ్వనించే మాటలను చాలా అలవోకగా చెప్పేశారు. గులాబీ పార్టీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆయనకు పుష్పగుచ్ఛం సమర్పించుకుని ఆయనతో కలిసి ఫోటోలు దిగడం, భేటీ కావడం, చర్చలు సాగించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనాంశంగా చర్చల్లో ఉంది.
విషయం ఏంటంటే.. ఈ నలుగురూ కూడా.. తాము తమ తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి ముఖ్యమంత్రిని కలిశామే తప్ప.. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అంటున్నారు. అలాంటి మాటల ద్వారా.. తాము కాంగ్రెసులోకి ఫిరాయించడం లేదు అనే సంకేతాలను పంపడానికి ప్రయత్నిస్తున్నారు.
అయినా, తాడిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా సరే కల్లు తాగినట్టే ఈ దుష్ట సమాజం భావిస్తుందనేది ప్రజలందరూ ఎరిగిన సామెత! ఈ సంగతి సామాన్యులైన మనబోటి వారికంటె రాజకీయాల్లో ఉన్న వారికి ఇంకా బాగా తెలుస్తుంది.
ఒకవైపు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల జోలికి ఇంకా వెళ్లకుండా కిందిస్థాయిలో కార్యకర్తల్ని అందరినీ ఆ పార్టీలోంచి ఖాళీ చేసేస్తూ మునిసిపాలిటీలను, జిల్లా పరిషత్ లను తమ వశం చేసుకుంటూ కాంగ్రెస్ రాజకీయం నడిపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందనే గులాబీ విమర్శలకు కౌంటర్‌గా పార్లమెంటు ఎన్నికల తర్వాత భారాస నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని సాక్షాత్తూ మంత్రులే సెలవిస్తున్న తరుణంలో.. నలుగురు భారాస ఎమ్మెల్యేలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ‘మర్యాదపూర్వకంగా’ కలవడం కూడా.. ఫిరాయింపునకు తొలిమెట్టుగానే ఈ పాడు సమాజం భావిస్తున్నది. సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), మాణిక్ రావు (జహీరాబాద్) లు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
అయితే ఈ నలుగురు భేటీ అయి వచ్చిన వెంటనే భారాస కంగారు పడింది. వారితో మాట్లాడింది. సునీత లక్ష్మారెడ్డి మాత్రం తన నియోజకవర్గ డెవలప్మెంటు అనే పదంతో పాటు ఎమ్మెల్యే భద్రత గురించి మాట్లాడాం అన్నారు. మహిపాల్ రెడ్డి కాస్త క్రియేటివిటీ ప్రదర్శించారు. ప్రధాని మోడీని సీఎం రేవంత్ ఎలా కలిశారో.. తాము కూడా సీఎం ను అలాగే కలిశాం అని సెలవిచ్చారు. మిగిలిన ఇద్దరు కూడా ఇంచుమించు ఇలాంటి ప్రకటనలే చేశారు. అయితే భారాసలో మాత్రం కంగారు ఇంకా తగ్గలేదు. బుధవారం నాడు వారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
తాము భేటీ కావడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టుగా పార్టీ ప్రకటించింది. అయితే, కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందన్నట్టుగా.. వీరు ఫిరాయించబోయేది లేనిదీ.. ఈ ప్రెస్ మీట్ లో తేలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో కేవలం ‘దుష్ప్రచారాన్ని’ ఖండించడం మాత్రమే కాకుండా.. రేవంత్ సర్కారు మీద ఈ నలుగురు ఎలా విరుచుకుపడతారు.. అనే దాన్ని బట్టి.. వారు ఫిరాయిస్తున్నారా? లేదా? అనేది అర్థమైపోతుందని అంటున్నారు.
అయినా ఇలాంటి కలయికలకు అర్థాలే వేరుగా ఉంటాయి. వీరివైపు నుంచి సిగ్నల్ వెళ్లిపోయింది. అటు రేవంత్ నుంచి పచ్చజెండా ఎప్పుడు ఊపుతారనే దాన్ని బట్టి, అప్పటిదాకా వారు గులాబీ ప్రేమనే ఒలకబోస్తూ ఈ గట్టున ఉంటారని, అటు నుంచి సిగ్నల్ రాగానే జంప్ చేసేస్తారని ప్రజలు అనుకుంటున్నారు.