వేటు పడ్డాక ఓటుపై ఆశ.. రేటు ఉందా గంటా?!

ఆయన ప్రజల సమస్యల కోసం తన పదవిని కూడా తృణప్రాయంగా ఎంచే త్యాగమూర్తిగా కీర్తి దక్కించుకోవాలని ఆయన అనుకున్నారు. ప్రతిపక్షంలో మిగిలిపోయిన ఎమ్మెల్యేగా బావుకునేది ఏమీ లేదు కాబట్టి… ఆ ఎమ్మెల్యే పదవిని కూడా…

ఆయన ప్రజల సమస్యల కోసం తన పదవిని కూడా తృణప్రాయంగా ఎంచే త్యాగమూర్తిగా కీర్తి దక్కించుకోవాలని ఆయన అనుకున్నారు. ప్రతిపక్షంలో మిగిలిపోయిన ఎమ్మెల్యేగా బావుకునేది ఏమీ లేదు కాబట్టి… ఆ ఎమ్మెల్యే పదవిని కూడా త్యజించేస్తే.. తనకు త్యాగరాజు బిరుదు వస్తుందని ఆశపడ్డారు.

అందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి స్పీకరు ఫార్మాట్ లో చాలకాలం కిందట రాజీనామా చేశారు. అది ఇప్పుడు ఆమోదం పొంది తాను హఠాత్తుగా మాజీఅయిపోయే సరికి.. ఈ పరిణామం గంటా శ్రీనివాసరావుకు మింగుడుపడడం లేదు. మూడేళ్ల కిందట రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి స్పీకరు ఫార్మాట్ లో రాజీనామా చేసిన తర్వాత.. స్పీకరు దానిని ఎప్పుడైనా ఆమోదించవచ్చు. ఎమ్మెల్యేను పిలిపించి ఒకసారి మాట్లాడడం అనేది సాంప్రదాయం, లాంఛనం మాత్రమే. రూలు కాదు. అయినా.. గంటా విషయంలో ఆ లాంఛనం కూడా ఎన్నడో పూర్తయింది. ఆమోదం ఇప్పుడు వచ్చింది. తీరా తన మీద వేటు పడగానే.. గంటా రంకెలు వేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ఆమోదించారని అంటున్నారు. కావొచ్చు గాక. అయితే మాత్రం ఏంటి?

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తనకున్న అవకాశాలపై న్యాయసలహా తీసుకుంటానని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత ఇంకా ఓటు వేయడం ఏమిటి.. కామెడీ కాకపోతే అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది.

ఇంకా జాగ్రత్తగా గమనిస్తే.. మూడేళ్ల కిందటే పదవిని వదులుకున్న వ్యక్తికి.. చాన్నాళ్లపాటూ అసలు శాసనసభకు కూడా రాని వ్యక్తికి.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయాలనే కోరిక ఇంత బలంగా ఉన్నదంటే అందులో ఏదో మతలబు ఉన్నదని కూడా అనిపిస్తుంది. ఆ ఓటుకు ఒక రేటు ఉన్నదేమో అనే అభిప్రాయం కలుగుతుంది.

తెలుగుదేశానికి ఎంపీని గెలిపించుకునే బలం లేకపోయినప్పటికీ.. వారు బరిలో అభ్యర్థిని మోహరిస్తే గనుక.. అవసరమైన ఓట్లకోసం రకరకాల మాయోపాయాలను ఆశ్రయిస్తారు. పైగా ఇలాంటి ఎన్నికల్లో ఓట్లను కోట్లతో కొనడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ఇదే తరహా కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబు.. ఇంకా ఆ కేసు పాపం నుంచి బయటపడనేలేదు.

ఏపీలో రాజ్యసభ ఎంపీని నెగ్గించుకోడానికి అంతకుమించిన కుట్రలు చేయగలరు. తమ సొంత పార్టీ వారికి కూడా.. అభ్యర్థితో కోట్ల రూపాయలు ఇప్పించగలరు. ఎన్నికలు ఇంకా రెండు నెలలదూరంలోనే ఉన్నందున.. సదరు కోట్ల రూపాయలు అందరికీ అవసరమే. బహుశా గంటా కూడా అందుకే.. ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసి తీరాల్సిందేనని ఆరాటపడుతున్నారేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు.