వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ సారథిగా దూసుకువెళుతోంది. కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించే లక్ష్యం ఆమెలో ఏమేర ఉన్నదో తెలియదు గానీ.. ఈ ముసుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలని, ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టాలనే దుగ్ధ మాత్రం పుష్కలంగా కనిపిస్తోంది.
తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తానంటూ హడావుడి అనంతరం కాంగ్రెసులో విలీనం చేసి ఏపీలో పగ్గాలు పుచ్చుకున్న షర్మిల డ్రామా వెనుక చంద్రబాబునాయుడు విషపూరితమైన కుట్రకోణం ఉన్నదనే వాదన ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఇలాంటి కీలక సమయంలో.. కాంగ్రెసులో విలీన నిర్ణయం తీసుకునే వరకు, తెలంగాణ షర్మిల పార్టీకి అండదండగా, ఆమెకు కీలకమైన అనుచరుడిగా నిలిచిన నాయకుడు కొండా రాఘవరెడ్డి కొన్ని లోగుట్టు సంగతులను వెల్లడిస్తున్నారు. అన్న జైలులో ఉన్నప్పుడు.. ఆయన తరఫున షర్మిల పాదయాత్ర చేసిన సమయంలోనే.. ఆమెలో కుట్రకోణం దాగి ఉన్నదని ఆయన ఇప్పుడు వెల్లడిస్తున్నారు.
కొండా రాఘవరెడ్డి అంటే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పురుడుపోసుకున్న నాటినుంచి షర్మిలకు అండగా ఉన్న కీలక నాయకుడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల్లో ఒకరైనా తెలంగాణ నేత. ఆయన బిడ్డ షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఆమె వెన్నంటి నిలిచారు. పార్టీ నిర్మాణంలో సహకరించారు. ఆమె పాదయాత్రలకు సూత్రధారిగానూ ఉన్నారు. అయితే.. కాంగ్రెసులో విలీనం చేసి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఆలోచనకు వచ్చిన తర్వాత.. ఆయన విభేదించి బయటకు వెళ్లారు.
అసలు కొండా రాఘవరెడ్డి ఏనాడూ వైతెపా కార్యకర్త కానే కాదని షర్మిల ఆయన గురించి చులకనగా వ్యాఖ్యలు చేశారు కూడా. అయితే ఆయన ప్రస్తుతం తెరమీదకు వచ్చి.. షర్మిలలోని కుట్రకోణం ఇవాళ్టిది కాదనే సంగతిని బయటపెడుతున్నారు. ఆయన చెబుతున్న ప్రకారం..
వైఎస్ జగన్ జైలులో ఉన్న సందర్భంలో పార్టీని కాపాడుకోవడానికి, ప్రజలతో మమేకం కావడానికి తల్లి విజయమ్మతోనే పాదయాత్ర కొనసాగింపజేయాలని తొలుత అనుకున్నారట. అయితే.. తల్లికి మోకాళ్ల నొప్పులని ఆమె పాదయాత్ర చేయకుండా షర్మిల అడ్డుకున్నదట. ఆ తర్వాత జగన్ భార్య భారతితో పాదయాత్ర చేయించాలని అనుకుంటే, దానికి కూడా షర్మిల అడ్డు చెప్పిందిట. అన్నకోసం తాను పాదయాత్ర చేస్తానని ఆమె స్వయంగా ముందుకు వచ్చిందని, అయితే అప్పటికే మనసులో విషబీజాలు, స్వార్థపూరిత ఆలోచనలు పెట్టుకుని షర్మిల వ్యూహాత్మకంగా పాదయాత్ర చేసిందని కొండా అంటున్నారు.
జగన్ సీఎం కాగానే.. షర్మిల భర్త అనిల్ కలిసి ప్రభుత్వాధినేతగా తనకు ఒక పని చేసిపెట్టాలని అడిగారని, రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమైన దానిని జగన్ ఒప్పుకోకపోవడంతో.. షర్మిల- అనిల్ ఆయన మీద పగబట్టారని కొండా వెల్లడిస్తున్నారు. ఆమె విషం చిమ్ముతోంటే.. ఆమెను వెనుక నుంచి కొన్ని దుష్టశక్తులు నడిపిస్తున్నాయని ఆయన అంటున్నారు. షర్మిల విషం చిమ్ముతున్న సంగతి ప్రజలకు కనిపిస్తోంది. కనిపించని ఆ దుష్టశక్తులను ప్రజలు సులభంగానే తెలుసుకోగలుగుతున్నారు.