Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇదేం దిక్కుమాలిన రాజకీయం బాబుగారు?

ఇదేం దిక్కుమాలిన రాజకీయం బాబుగారు?

"ఖడ్గం" సినిమాలో ఒక పాపులర్ సీనుంది. తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పలేని ట్యాలెంట్-లెస్ హీరోగా నటిస్తుంటాడు పృథ్వి. ఎన్ని టేకులైనా పని జరక్కపోయే సరికి సహనం కోల్పోయిన పక్కనున్న జూనియర్ ఆర్టిస్ట్ రవితేజ ఆ డైలాగ్ చెప్పేసి చిరాకుపడి వెళ్లిపోతాడు. 

చంద్రబాబు గారు! ఇప్పుడు నాకు మీరు ఆ పృథ్వి పాత్రలా కనిపిస్తున్నారు. మీ పక్కనున్న కార్యకర్తల్లో చాలామంది రవితేజ టైపులో రియాక్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. లేకపోతే ఇదేం దిక్కుమాలిన రాజకీయం బాబు గారు! పాముపిల్లకి పాము పోసి పెంచితే  విశ్వాసం చూపుతుందని గ్యారెంటీ లేదు. పక్కోడినే కాదు..మనల్నే కాటేయొచ్చు.

ఎందుకూ పనికిరాని జనసేన పార్టీని నెత్తిన పెట్టుకుని ఊరేగి ఆ పార్టీ అధినేతకి సీను పెంచి, అవసరానికి భారీ ఖర్చులు పెట్టి నిలబెట్టారు తమరు. అతనేమో ఐదేళ్లల్లో హాయిగా సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పొలిటీషియన్ లాగ అప్పుడప్పుడు వచ్చి పర్ఫామెన్స్ ఇచ్చి వెళ్లిపోవడం. తమరేమో ఐదేళ్లు నానా తిట్లూ తింటూ, తిప్పలు పడుతూ.. ప్రెస్సు ముందు ఏడ్చి, 52 రోజులు జైల్లో నలిగి రాజకీయమే ఊపిరిగా బతకడం. 

సరిగ్గా ఎన్నికలకి రెండు నెలలున్నాయనగా పవన్ బుద్ధిని బయటపెడుతూ తెదేపాతో పొత్తుతో సంబంధం లేకుండా రాజానగరం, రాజోలులో జనసేన నిలబెడుతుందని ప్రకటించాడు. ఏం చూసుకుని ఈ బలుపు? వైకాపాలో చోటు లేదని భంగపడి తన పార్టీలో చేరుతున్న సీనియర్ కాపు నాయకుల్ని చూసుకునే కదా! దీనికి కారణం ఎవరు? అతనికి అలా బుసగొట్టే విధంగా పాలు పోసిందెవరు? తమరే కదా!!! 

అసలు తెదేపాతో పొత్తు ఉంది కనుకనే ఆ సీనియర్ కాపు నాయకులు, ఇంకా కొందరు పేరున్న నాయకులు జనసేనలో చేరుతున్నారన్నది వాస్తవం. తద్వారా ఒకవేళ ఈ కూటమి నెగ్గితే సీనియారిటీని అడ్డం పెట్టుకుని మంత్రి పదవులు వెలబెట్టచ్చనే ఏకైక ఆలోచన రిటైరైపోయి ఇంటికి పరిమితమైన నాయకుల్ని కూడా బయటికి రప్పించింది. 

ఆ వాపుని చూసుకుని బలుపనుకుని పవన్ అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉండొచ్చు. అప్పటికిప్పుడు పొత్తు లేదని తెగేసి చెప్పండి..జనసేన కండువాల్ని తీసేసి పవన్ నెత్తి మీద కప్పి మరీ వెళ్లిపోతారు ఈ నాయకులు. ఆ సీనియర్ నాయకులు వేల్యూ ఇచ్చేది పరోక్షంగా తమకే తప్ప పవన్ కి కాదు. 

ఇంత బహిరంగంగా విషయం అర్ధమవుతున్నా మీరు జనసేనతో పొత్తుంటే తప్ప పని జరగదేమో అనే డిస్పరేషన్లో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తలతిక్క రాజకీయం చేస్తున్నారు. 

రేపు పవన్ ని పిలిచి మళ్లీ పంచాయితీ పెట్టుకుని బుజ్జగింపు చర్యలు గట్రా చేస్తారేమో అని భయంగా ఉంది. జనసేన జుట్టు మీ చేతిలో ఉండాలి తప్ప తెదేపా జుట్టు పవన్ చేతిలో కాదు ఉండాల్సింది. ఏదో రాజకీయం చేస్తున్నానని భ్రమ చెంది ఉన్న కొంపకే నిప్పు పెట్టించుకుంటున్నారు. 

దయచేసి పొత్తు లేదూ గిత్తూ లేదు అని తెగేసి చెప్పండి. సోలోగా మీ నిర్ణయం మీరు తీసుకుని అభ్యర్థుల్ని ప్రకటించండి. వారిలో కాపు సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయండి. ఇక జనసేన అవసరం ఉండనే ఉండదు. 

ఈ పొత్తు ఒక గుదిబండ తప్ప ఏదీ కాదు. దానివల్ల ఇప్పటి వరకు తమరు అభ్యర్థుల్నే ప్రకటించలేకపోతున్నారు. జనసేనకి జనంలో మీరనుకున్నంత ఫాలోయింగ్ లేనే లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేంత సీనే లేదు. అతని పార్టీలో మీ దయవల్ల తప్ప అసలు నిన్నటి వరకు పేరున్న నాయకులే లేరు. సమర్ధులు కూడా లేరు. 

ఇకనైనా పోయిందేమీ లేదు. పొత్తు నియమాన్ని ఉల్లంఘిస్తూ రాజోలు, రాజనగరం గురించి మాట్లాడినందుకు బదులుగా పొత్తును వదిలించుకోండి. అదే తేదేపాకి చాలామంచిది. 

ఇక్కడ యుద్ధం వైకాపాకి తేదేపాకి మధ్యనే ఉంది. మరే దారికిపోయే పార్టీని మీరు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. 

అసలిదంతా కాదు. రేపు ఎన్నికల్లో గెలిస్తే జనసేనతో పొత్తు వల్లనే గెలిచామని చెప్తారు. ఏమీ లేని దానికే మీరు జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి వీక్ గా ఉన్న తెదేపాకి తాను బలం చేకూరుస్తున్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక గెలిస్తే ఆగుతారా? రాష్ట్రంలో ఏ దాడి జరిగినా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి కల్పిస్తారు...మా వల్ల గెలిచి మా వాడిని అరెష్ట్ చేస్తావా..అని నిలదీస్తారు. ఆ గోలని కంట్రోల్ చేయగలిగే శక్తి మీకు లేదు బాబుగారు. 

అందుకే ముందు నుంచీ ఆ పార్టీతో సంబంధాలు వద్దనే అభిప్రాయపడుతూ వచ్చాం. కానీ మీరు పదవి కోసం భయంకరమైన తప్పు చేసారు. ఒక సారి కాకపోతే మరోసారన్నా గెలుస్తాం సోలోగా పోరాడితే. ఈ పొత్తు వల్ల గెలిచినా సుఖం ఉండదు. మీ పాలన మీరు చేసుకోలేరు. వాళ్లు చేసుకోనీయరు. 

జనానికి ఇప్పుడంతా అర్ధమైపోతోంది. గతంలోలా కాదు. పొత్తుల్ని వాళ్లు చాణక్యం అనుకోవట్లేదు... చేతకాని తనం అనుకుంటున్నారు. మనం పదవి రాదేమోనన్న భయంతో ఎంత దిగజారిపోయామో కూడా చూస్తున్నారు. సమర్ధించుకోవడానికి మాకు మాటలు దొరకడం లేదు. 

ఇది నా ఒక్కడి మాటే కాదు. నా తోటి కార్యకర్తల మాట కూడా. మీకు నేరుగా చెప్పుకోలేక, సొంత సోషల్ మీడియా అకౌంట్లో ఇంత ఘాటుగా రాయలేక, ఈ వ్యాసాన్ని ఇక్కడ తప్ప ఇంకెవ్వరూ వెయ్యరని తెలిసి రాసి ఈ సైటుకి పంపుతున్నాను. ఒకవేళ ఈ సైటు ఈ వ్యాసాన్ని ప్రచురిస్తే ఇది మీ దాకా చేరుతుందని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం, మా ప్రాప్తం. 

ఒక తెదేపా కార్యకర్త

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?