‘ఓవరాక్షన్ చేస్తే తిత్తి తీస్తా..’ లాంటి సినిమాటిక్ డైలాగులను అనలేదు గానీ.. పవన్ కల్యాణ్ దాదాపుగా అంత పనీ చేశారు. రిపబ్లిక్ డే రోజున జెండా ఎగరేసిన తర్వాత చేసిన ప్రసంగంలో ఆయన తమ పార్టీ తరఫున రెండు ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించడం అనేది కీలక పరిణామం.
పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో తెలుగుదేశంలో కంగారు పుట్టింది. పొత్తుబంధం నుంచి పవన్ కల్యాణ్ జారిపోతే తమ పార్టీ పుట్టి మునుగుతుందని వారి భయం. పవన్ కల్యాణ్ భుజాల మీద యెక్కి సవారీ చేస్తూ చంద్రబాబును అధికారపీఠం మీదికి తీసుకుపోవాలని అనుకుంటే.. పవన్ కల్యాణ్ అప్రమత్తం కావడం తెలుగుదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే నష్టనివారణకు వారు రంగంలోకి దిగారు. ‘అబ్బెబ్బే.. జనసేన పోటీచేసే సీట్లనే ప్రకటించారు. ఇరుపార్టీల మధ్య ఆల్రెడీ అవగాహన కుదిరిన సీట్లనే ఆయన ప్రకటించారు. అందువల్ల తెలుగుదేశానికి ఇబ్బంది ఏమీ లేదు..’ అంటూ మెరమెచ్చు మాటలు మాట్లాడుతున్నారు.
టీడీపీ తరఫున.. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి చెబుతున్న ఈ మాయమాటలు నిజమే కావొచ్చు గాక.. కానీ.. సీట్ల ప్రకటన సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. తెలుగుదేశం చెబుతున్న వివరణలు గతిలేనమ్మ అనుసరించే సర్దుబాటు ధోరణిలాగానే కనిపిస్తోంది.
రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించే సందర్భంగా పవన్ కల్యాణ్.. ఒక రకంగా తెలుగుదేశం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నారా చంద్రబాబునాయుడు, చినబాబు నారా లోకేష్ వైఖరులను కూడా ఆయన తీవ్రంగా నిరసించారు. ఆయన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
చంద్రబాబునాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకుండా తనంతతానుగా రెండు సీట్లను ప్రకటించేశారని పవన్ అన్నారు. నారా లోకేష్ సీఎం పదవిలో అయిదేళ్లపాటూ తన తండ్రి చంద్రబాబే ఉంటారని చెప్పినా కూడా తాను పొత్తులు ముఖ్యమనే ఉద్దేశంతో ఊరకుండిపోయానని పవన్ తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ మాటలు ఖచ్చితంగా.. తెలుగుదేశం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల పట్ల పవన్ లో ఉన్న అసహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఆ పార్టీల మధ్య ఇప్పటికే ప్రకటితమైన సీట్ల గురించి వారి మధ్య నిజంగానే అవగాహన కుదిరి ఉండవచ్చు. కానీ.. పొత్తుల్లో ఉన్న పార్టీలు వాటిని ప్రకటించుకోవాల్సిన తీరు ఇది కాదు కదా! పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు జనసేన నేతల్లో, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో తెలుగుదేశం పట్ల వ్యతిరేకతను పెంచుతాయి. కానీ, తెలుగుదేశానికి వేరే గతిలేదు.
పవన్ తో జట్టుకట్టకుంటా.. తమ పార్టీ బతికి బట్ట కడుతుందనే నమ్మకం వారికి లేదు. అందుకే పవన్ తన మాటల్లో చంద్రబాబు వైఖరి గురించి ఎంత ఛీత్కారంగా మాట్లాడినా.. తెలుగుదేశం మాత్రం ముందు అనుకున్నదే అంటూ గతిలేని మాయమాటలు చెబుతోందని ప్రజలు అనుకుంటున్నారు.