వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ప్రజలు ఊహించనంత సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని, అవే తమను మళ్లీ విజయం దరిజేరుస్తాయని ఆశిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీ టికెట్ల కోసం భారీ స్థాయిలో పోటీ ఉండాలి. తాహతు ఉన్న నాయకులు టికెట్ల కోసం ఎగబడుతూ ఉండాలి.
కానీ కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఆ పార్టీకి సమర్థులైన అభ్యర్థుల కొరత ఉన్నదా? కొత్తగా నిర్ణయించిన అభ్యర్థులను కూడా మార్చేస్తూ గందరగోళంలో ఉన్నదా? మార్చడానికి సరైన వారు లేక ఇంకా దేవులాటలో ఉన్నదా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోవడం, ఆ కసరత్తులో జాప్యం ఇలాంటి అభిప్రాయం కలిగిస్తోంది.
నరసరావుపేట ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీ తరఫున ఓసీ అభ్యర్థులకే అవకాశాలు దక్కాయి. బీసీలకు విధిగా ఎంపీసీటును కేటాయించడం ద్వారా కులాల సమతూకం పాటించాలని జగన్ అనుకున్నారు. నియోజకవర్గంలో 1.25 లక్షల యాదవ ఓటు బ్యాంకు ఉండడంతో.. ఆ సామాజిక వర్గం నుంచే ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయాలని భావించారు. ఆమేరకు నాగార్జున యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అవుతారనే ప్రచారం జరిగింది. ఇది పార్టీకి సిటింగ్ స్థానం కావడంతో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరునుంచి పోటీచేయమని అడిగేసరికి, ఆయన అలిగి బయటకు వెళ్లారు.
తెలుగుదేశం తరఫున బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది. ఆయన గుంటూరు నుంచి పోటీచేస్తే సమీకరణాలు ఎలా ఉంటాయని భావించారో గానీ.. ఏకంగా పార్టీనుంచి బయటకు వెళ్లడంతో వైసీపీలో అయోమయం నెలకొంది. ఇప్పుడు నాగార్జున యాదవ్ స్థానంలో ఇతర పేర్లను పరిశీలిస్తున్నారు.
నెల్లూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ముఖ్యమంత్రి పిలిపించి నరసరావుపేట స్థానం నుంచి పోటీచేయడానికి అడిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో.. బీసీ మహిళా అభ్యర్థిగా విడదల రజని పేరును కూడా పరిశీలిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్ని రకాల గందరగోళాలకు జగన్ ఎందుకు గురవతున్నారు.
ఒకవేళ నరసరావుపేట ఎంపీగా యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థే కావాలని, వారు మాత్రమే నెగ్గుతారని అభిప్రాయం ఉంటే గనుక.. ఆ పార్టీలో ఆ నియోజకవర్గం నుంచి ఆ కులానికి చెందిన మరొక నాయకుడే లేకుండాపోయారా? ఎక్కడో నెల్లూరు నుంచి నాయకుడిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా? అనేది చాలా మందికి కలుగుతున్న సందేహం.
ఈ పరిణామాలను గమనిస్తోంటే.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాల కోసం ఎంతగా పోటీ ఉన్నా.. కొన్ని చోట్ల నాయకులు లేరనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. అలాగే లావు శ్రీకృష్ణ వెళ్లిపోగానే పార్టీ కంగారు పడుతోందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళతాయని పలువురు భావిస్తున్నారు.