వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు, వైఎస్ తనయ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను కించపరిచేలా వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటే ఇటీవల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షర్మిలను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేడీలంటే భయం లేదంటూ ఆమె వాటిని చేతబూని మరీ మాట్లాడారు. షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే…
“మీకు (కేసీఆర్) దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. మీకు చేతనైతే అరెస్ట్ చేయండి. గుర్తు పెట్టుకో కేసీఆర్ … నా పేరు వైఎస్ షర్మిల. రాజశేఖరరెడ్డి బిడ్డను. పులి బిడ్డను. నాకా భయం? ఈ బేడీలు నన్ను ఆపుతాయా? రాజశేఖరరెడ్డిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా చంపాలనుకుంటున్నారు. కానీ బతికినంత కాలం, ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవరి తరం కాదు. నీ అవినీతి పాలన గురించి మాట్లాడ్డం, నా గొంతు నొక్కడం నీ వల్ల కాదు. ఆపడం నీ తరం కాదు. ఉన్నారు కదా మీ పోలీసులు. పనోళ్లలాగా వాడుకుంటున్నారు కదా.
మీ పనోళ్లని పంపి నన్ను అరెస్ట్ చేయండి. మీకు దమ్ముందా? నీతో పోలీసులు వుంటే, నాతో ప్రజలున్నారు. పాదయాత్రలో ఉన్నా. జనం మధ్య ఉన్నా. జనం కోసం పోరాడుతున్నా. ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. నేను రెడీ, మీరు రెడీనా? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి” అని వైఎస్ షర్మిల సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
కేసీఆర్‌కు సవాల్ విసరడం కంటే, తన తండ్రిని కుట్ర చేసి అంతమొందించారని షర్మిల ఆరోపించడం కలకలం రేపుతోంది. నన్ను కూడా అలా చేయాలని అనుకుంటున్నట్టు ఆమె వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందో అనే చర్చకు తెరలేచింది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించడం వల్ల తన ఉనికిని గుర్తిస్తారని షర్మిల వ్యూహాత్మకంగా రెచ్చగొడుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. వైఎస్సార్‌ను కుట్ర చేసి చంపారనే షర్మిల వ్యాఖ్యలపై ప్రత్యర్థుల రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.