షర్మిల, సునీత… ఇద్దరూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెళ్లు. ఒకరు సొంత చెల్లెలు, మరొకరు చిన్నాన్న కూతురు. గత కొంత కాలంగా వీళ్లిద్దరు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. తండ్రి హత్య కేసుకు సంబంధించి విచారణలో భాగంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత పేరు తరచూ వినిపిస్తోంది. ఇక వైఎస్ షర్మిల విషయానికి వస్తే… అన్న వైఎస్ జగన్ వారించినా తెలంగాణలో సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ పేరు వైఎస్సార్‌టీపీ. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.
ఇటీవల షర్మిల చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఒకటి తన తండ్రిని కుట్రపూరితంగా హత్య చేశారని, రెండోది ఏపీలో హెల్త్ వర్సిటీకి దివంగత ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్సార్ పేరు పెట్టడం తప్పని షర్మిల చెప్పడం రాజకీయంగా కలకలం రేపాయి. షర్మిల కామెంట్స్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
తెలంగాణలో తన రాజకీయాలేవో చూసుకోకుండా, పచ్చ బ్యాచ్‌కు ఉపయోగపడేలా షర్మిల అభిప్రాయాలు చెప్పడం ఏంటనే విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సునీత, షర్మిల మధ్య చాలా వ్యత్యాసం వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవేంటో కూడా నెటిజన్లు చెబుతున్నారు.
‘మా నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఆయనను నేను ఆరాధించినట్టుగా ఎవరూ ఆరాధించలేదు’ అని షర్మిల చెప్పడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు.
ఇదే వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఎప్పుడూ తండ్రి ప్రేమ గురించి మాట్లాడలేదు. తండ్రిపై తనకెంత ప్రేమో ఆచరణలో చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి హంతుకులెవరో తేల్చేందుకు డాక్టర్ సునీత అలుపెరగని పోరాటం చేయడాన్ని నెటిజన్లు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో కూడా విభేదించి న్యాయ పోరాటం సాగిస్తున్న వైనాన్ని ప్రశంసిస్తున్నారు.
కానీ వైఎస్ షర్మిల మాత్రం తన తండ్రిని హత్య చేశారని ఆరోపిస్తున్నారే తప్ప, హంతకులెవరో తేల్చేందుకు సోదరి సునీతలా న్యాయ పోరాటం ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఎంతసేపూ తండ్రిని హత్య చేశారని ఆరోపించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే స్వార్థపూరిత ఆలోచన ఉన్నట్టు జనానికి కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో షర్మిల మాదిరిగా డాక్టర్ సునీత ఎప్పుడూ ‘వైఎస్’ ఇంటి పేరును వాడుకోవాలని చూడకపోవడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇటీవల షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘నా పేరు వైఎస్ షర్మిల’ అని నొక్కి చెప్పడాన్ని గుర్తు చేస్తూ… సునీతకు, వైఎస్సార్‌టీపీ అధినేత్రికి తేడా ఇదే అని పోల్చి చెబుతున్నారు. డాక్టర్ సునీత తన తండ్రి కోసం చేస్తున్నట్టుగా, తననెంతో ప్రేమించే వైఎస్సార్ కోసం షర్మిల ఏం చేశారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.