తెలుగుదేశం పార్టీ విశాఖ రాజకీయం సవ్యంగా సాగడం లేదు. పార్టీని అయిదేళ్ల పాటు మోసిన వారిని పక్కన పెట్టి పొత్తుల ఎత్తుల పేరుతో వేరే పార్టీలకు సీట్లు కేటాయించడంతో తమ్ముళ్ళు అంతా రగిలిపోతున్నారు. సీనియర్లు అంతా కూడా పసుపు పార్టీ మీద గుర్రు మీద ఉన్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ఒక సీనియర్ టీడీపీ నేత తన పదవికి రాజీనామా చేశారు. రెబెల్ గా తాను బరిలో ఉంటాను అని స్పష్టం చేశారు. ఇపుడు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. ఆయనకు టికెట్ ఇస్తానని చెప్పి విశాఖ సౌత్ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తే గత మూడేళ్ళుగా కష్టపడుతున్నారు.
అన్ని రకాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్లిన తరువాత ఇపుడు పొత్తు అంటూ ఈ సీటుని జనసేనకు అప్పగించారు. దాంతో గండి బాబ్జీ మండిపోయారు. ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులు టీడీపీ మీద నిప్పులు చెరుగుతున్నారు.
పార్టీ తమను వాడుకుని వదిలేసిందని నిందిస్తున్నారు. గండి బాబ్జీ అయితే తాను పార్టీని వీడుతున్నట్లుగా స్పష్టం చేశారు. పార్టీ ప్రకటించిన రెండవ జాబితాలో తన పేరు లేకపోవడంతో తాను మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు.
ఇదిలా ఉంటే గండి బాబ్జీ బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయనకు విశాఖ సౌత్ ఇవ్వకపోయినా మాడుగుల అయినా ఇస్తామని పార్టీ పెద్దలు చెబుతూ వచ్చారని అంటున్నారు. ఇపుడు మాడుగులకు అభ్యర్ధిని ప్రకటించడంతో భవిష్యత్తు అర్ధమైన గండి బాబ్జీ టీడీపీకి వీడ్కోలు అని బయటకు వచ్చేశారు.
తొందరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాను అని ఆయన అంటున్నారు. గండి బాబ్జీ మొదట కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయన 2004లో పరవాడ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత టీడీపీలో చేరినా 2019లో టికెట్ ఇవ్వలేదు సరికదా 2024లోనూ ఇవ్వలేదు.
దాంతో ఆయన ఇపుడు ఏవైపు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన మాత్రమే కాదు, విశాఖలో కీలకమైన నియోజకవర్గాలలో పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే తమ సీట్లో పొత్తుల పేరుతో వేరే పార్టీని తెచ్చి పెట్టడంతో మండిపోతున్నారు. ఇవన్నీ విశాఖ టీడీపీలో సైకిల్ జోరుకు పంక్చర్లు వేసేలా ఉన్నాయని అంటున్నారు.