జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ మూసుకోవడం ఉత్తమమని వైసీపీ మంత్రి సీదరి అప్పలరాజు సూచించారు. దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి మరో పార్టీకి ఊడిగం చేసిన చరిత్ర ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. మరీ ఇంతలా టీడీపీకి పవన్ సరెండర్ అయిపోతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.
ఇదే పవన్ కళ్యాణ్ 2018 ప్రాంతంలో టీడీపీ అవినీతి ప్రభుత్వం అని ఆరోపించ లేదా అని సీదరి ప్రశ్నించారు. ఇపుడు నాలిక మడతేసి అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న బాబుకు మద్దతు ఇవ్వడం కంటే దారుణం ఉంటుందా పవన్ అని ఆయన నిలదీశారు.
జనసైనికుల మనోభావాలను ఒక్కసారి పవన్ గమనించాలని ఆయన అనడం విశేషం. ఎంతసేపు టీడీపీ జెండా మోసై వారి అజెండాను అమలు చేస్తామని జనసైనికులు అంటున్నారని మంత్రి పవన్ దృష్టికి తెచ్చారు. పవన్ ప్యాకేజీలు తీసుకుని హాయిగా ఉంటారని పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దామని చూసే సైనికులకే ఇబ్బంది వస్తోందని అన్నారు.
ఈ విధంగా చేస్తూ వస్తున్న పవన్ రాజకీయాలకు అసలు సూట్ కారని ఆయన తేల్చి చెప్పారు. మీ అన్న గారు చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఎలా విలీనం చేశారో అలా మీరు కూడా ఒక తోవ చూసుకోండని సలహా ఇచ్చారు. లేదా జనసేనను పూర్తిగా వైండప్ చేసేసి మీరు సినిమాలు తీసుకోవడం బెటర్ అని మంత్రి గారు సలహా ఇచ్చారు.
టీడీపీ అవినీతిని పవన్ సపోర్ట్ చేయడం అంటే తాను కూడా ట్రబుల్స్ ని ఫేస్ చేయడమే అని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. టీడీపీతో అంటకాగితే జనసేనకు వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా జస్ట్ రిజెక్ట్. ఇది వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుంది, తగిన పరిహారం కూడా పవన్ అందుకుంటారు అని ఆయన జోస్యం చెప్పారు.
జనసైనికులు ఆలోచించండి అంటూ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇపుడు నేరుగా వారికి అప్పీల్ చేయడం ద్వారా పవన్ రాజకీయ డొల్లతనాన్ని వేరేగా ఎక్స్ పోజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. వైసీపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది జనసైనికుల మనోగతం మీదనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు.