వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేసే అవకాశం వుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో మూడు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో అధికార పార్టీ వైసీపీ తన వ్యూహాల్ని వేగంగా అమలు చేయడానికి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తమను ధిక్కరించిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం ద్వారా టీడీపీకి రాజ్యసభ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని అధికార పార్టీ అనుకుంటోంది.
పార్టీని ధిక్కరించిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని మొదట వైసీపీ స్పీకర్‌కు లేఖ ఇచ్చింది. దీంతో టీడీపీ కూడా అప్రమత్తమైంది. తమ పార్టీకి చెందిన నలుగురిపై కూడా అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సదరు రెబల్ అభ్యర్థులకు నోటీసులు అందజేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
తనకు నేరుగా వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. వివరణ ఇచ్చేందుకు తమకు మరికొంత సమయం ఇవ్వాలంటూ ఒక వైపు స్పీకర్‌కు విన్నవించుకోవడంతో పాటు మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది. మరోవైపు సమయం ఇవ్వడానికి స్పీకర్ నిరాకరించారు. దీంతో ఈ నెల 29న స్పీకర్ ఎదుట వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
వైసీపీ రెబల్ అభ్యర్థులపై ఇవాళే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. నలుగురిపై అనర్హత వేటు వేయడానికే స్పీకర్ మొగ్గు చూపుతున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ రెబల్ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు సమాధానం ఏంటో చూడాలి.