ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి బీజేపీపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీతో పాటు వైసీపీ, టీడీపీని ఆమె ఏకిపారేస్తున్నారు. ప్రధాని మోదీని కేడీ అని కూడా ఆమె పరుషంగా తిట్టిపోస్తున్నారు. ఏపీకి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందనే షర్మిల విమర్శలకు కనీసం కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
షర్మిల విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి పురందేశ్వరి వద్ద సమాధానం లేదా? లేకపోతే కాంగ్రెస్ నాయకురాలి విమర్శలన్నీ నిజమే అని ఏపీ ప్రజానీకానికి ఆమె చెప్పదలుచుకున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. షర్మిల తమ పార్టీని, ప్రధాని మోదీని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నా గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న దగ్గుబాటి మౌనం పాటించడం వెనుక కారణం ఏంటనే బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నిత్యం తీవ్రస్థాయిలో పురందేశ్వరి విమర్శలు గుప్పించేవారు. అయితే జగన్ ప్రభుత్వంపై తన విమర్శల్ని సొంత పార్టీ నేతలే పట్టించుకోకపోవడంతో పురందేశ్వరి కొంత కాలంగా ఆచితూచి మాట్లాడుతున్నారు. టీడీపీతో పొత్తు విషయంలోనూ బీజేపీ జాతీయ నాయకత్వం ఆసక్తి చూపకపోవడంతో పురందేశ్వరి నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం. తమ ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ జాతీయ నాయకత్వం నడుచుకోనప్పుడు, తాను మాత్రం షర్మిలకు కౌంటర్ ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
బీజేపీలో తన సచ్ఛీలతను నిరూపించుకోవాలంటే షర్మిల విమర్శలకు ఆమె కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి. బీజేపీ మతతత్వ పార్టీ అని, మైనార్టీలను ఊచకోత కోస్తోందంటూ షర్మిల విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే ఇక పార్టీ ప్రతినిధిగా పురందేశ్వరి ఎందుకనే ప్రశ్న సొంత పార్టీ నుంచే రావడం గమనార్హం.