వీల్ చైర్ లో గడప గడపకూ…

గడప గడపకూ ఎమ్మెల్యేలను తిరగమని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. ఆరు నెలలుగా ఏపీలో అంతటా ఇది సాగుతోంది. వీలు చూసుకుని ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. కొందరు సరిగ్గా వెళ్లడంలేదని వైసీపీ హై కమాండ్ అసంతృప్తిని వ్యక్తం…

గడప గడపకూ ఎమ్మెల్యేలను తిరగమని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. ఆరు నెలలుగా ఏపీలో అంతటా ఇది సాగుతోంది. వీలు చూసుకుని ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. కొందరు సరిగ్గా వెళ్లడంలేదని వైసీపీ హై కమాండ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది అని వార్తలూ వస్తున్నాయి.

అయితే నెల రోజుల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయి ఈ రోజుకీ నడవలేని స్థితిలో నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఉన్నారు. అయినా సరే ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వీల్ చైర్ లో కూర్చునే వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఎమ్మెల్యే నాతవరం మండలంలోని శృంగవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తాజాగా  నిర్వహించారు. ఇలా వీల్ చైర్ లో ఎమ్మెల్యే రావడాన్ని చూసిన ప్రజలు కూడా ఎదురెళ్ళి స్వాగతం పలికారు, తమ సమస్యలు చెప్పుకుంటూనే ఆయన ఆరోగ్యం మీద కుశల ప్రశ్నలు వేశారు.

కమిట్మెంట్ తోనే ఎమ్మెల్యే ఇలా చేశారని మరి కొన్నాళ్ళు రెస్ట్ అవసరం అని డాక్టర్లు చెప్పినా ఆయన ప్రజల ముంగిటకు వీల్ చైర్ లో రావడం ద్వారా తానేంటో చెప్పారని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన నర్శీపట్నం నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా పాతుతామని, ఎమ్మెల్యే పట్ల జనంలో ఉన్న ఆదరణే తమకు శ్రీరామ రక్ష అని పార్టీ నేతలు అంటున్నారు.