వైసీపీ నేతలకు రెండేసి మాటలు ఎందుకు?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని విషయంలో అధికార పార్టీ స్పష్టత లేక కొట్టుమిట్టాడుతున్నదా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది! పరిపాలన ప్రజలకు మరింత చేరువగా ఉండాలంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని విషయంలో అధికార పార్టీ స్పష్టత లేక కొట్టుమిట్టాడుతున్నదా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది! పరిపాలన ప్రజలకు మరింత చేరువగా ఉండాలంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు మాత్రమే శరణ్యం అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 

అప్పటిదాకా ‘అమరావతిలో మాత్రమే రాజధాని ఉంటుంది’ అనే నమ్మకంతో తమ తమ వ్యాపార లావాదేవీలను ప్లాన్ చేసుకున్న వాళ్లందరూ కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వారి అత్యాశలు కూలిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం ప్రారంభించారు. సదరు ఉద్యమం ఇప్పుడు అరసవెల్లి దాకా పాదయాత్ర చేస్తోంది. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మూడు రాజధానులు ఎందుకు? అమరావతిలోనే కంప్లీట్ రాజధాని ఎందుకు నిర్మించడం లేదు? అనే విషయంలో వైసిపి నాయకుల మాటల్లోనే స్పష్టత కొరవడుతోంది? తమ వాదనలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వాళ్లు ఫెయిలవుతున్నారు.  రెండేసి రకాలుగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే లాగా తయారవుతున్నారు.

తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఒత్తిడి పూర్తయిన వెంటనే టీటీడీ బోర్డు ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి విశాఖలో తమ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. విశాఖ పార్టీ ఇన్చార్జి కూడా ఆయన అయిన సుబ్బారెడ్డి అక్కడ మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడారు! అధికార వికేంద్రీకరణను, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్ర జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అమరావతి ఉద్యమకారులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు మూడు రాజధానులు ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయంలో రెండు వాదనలను వినిపించారు!

అమరావతిలో రాజధాని కట్టాలంటే లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత డబ్బులు లేవు కనుక మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ మాటలు వింటే డబ్బు లేకపోవడం వలన మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నారా? అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో ఈ పని చేస్తున్నారా? అనే సందేహం ప్రజల్లో మిగిలిపోతుంది! 

నిజానికి అధికార వికేంద్రీకరణ ఒక మంచి ఆలోచన. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కోరిక.. సుదూర భవిష్యత్తు దృష్ట్యా ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలం అవుతోంది. అధికార వికేంద్రీకరణ మంచిది అని నమ్మేట్లయితే లక్ష కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ఖజానాలో మూలుగుతున్నా సరే అమరావతిలో రాజధాని కట్టనేకూడదు! ఎంత అవసరమో ఆ మేరకు, పరిమితంగా శాసన రాజధాని వరకే నిర్మించుకోవాలి! తమ శ్రద్ధ కేవలం అధికార వికేంద్రీకరణ మీదనే ఉన్నదని చాటుకోవాలి!! నాయకుల్లో ఆ స్పృహ కొరవడి తడవకోమారు ‘డబ్బు లేదు కాబట్టి అమరావతి కట్టడం లేదు’ అనడం ప్రభుత్వ చిత్తశుద్ధి మీద అనుమానాలు పెంచుతుంది!

వారు నమ్ముతున్న అధికార వికేంద్రీకరణ కాన్సెప్ట్‌ను వారే బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లకపోతే ఎలా? మూడు రాజధానులను సమర్ధించుకునే సమయంలో.. పొరపాటున కూడా అమరావతిలో కట్టాలంటే ఎక్కువ డబ్బులు కావాలి అనే మాటే ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయంలో వైసీపీ నేతలు అందరూ కూడా పప్పులో కాలేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో సహా! డబ్బుతో నిమిత్తం లేకుండా మూడు రాజధానులు రాష్ట్రానికి శ్రేయస్కరం.. ప్రజలకు మేలు చేస్తాయని నమ్ముతున్నందువలనే తాము ఆ పని చేస్తున్నామనే వాదనకు మాత్రమే ప్రభుత్వం కట్టుబడి ఉండి, అదొక్కటే సంగతి ప్రజల్లోకి తీసుకువెళ్తే బాగుంటుంది!