ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితితో స్నేహబంధం కలుపుకుని.. ఎన్నికల బరిలోకి దిగే పార్టీలు తెరమీదకు వస్తున్నాయి.
ఏపీలో ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల పోరు ద్విముఖం అవుతుందా, త్రిముఖం అవుతుందా? అనే మీమాంస నడుస్తోంది. బిజెపిని వెంటపెట్టుకుని, పవన్ చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడితే.. పోరు ద్విముఖమే! చంద్రబాబే ముఖ్యం అనుకుని బిజెపిని బేఖాతర్ చేస్తే.. పోరు త్రిముఖం అవుతుంది!
పవన్ కల్యాణ్ తో నిమిత్తం లేకుండా.. సొంతంగా బరిలోకి దిగడానికి బిజెపి సిద్ధంగానే ఉంది. అయితే తాజాగా బిఆర్ఎస్ ప్రకటన తర్వాత.. ఏపీలో వారి అడుగులు ఎలా ఉంటాయనే విషయంలో నెమ్మదిగా సంశయాలు తొలగుతున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో గులాబీకి వెన్నుదన్నుగా ఉండడానికి, తద్వారా స్వకార్యం కూడా నెరవేర్చుకోవడానికి, ఎర్రదండు సిద్ధంగా ఉంది!
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు కూడా. కొన్ని అంశాల్లో కేసీఆర్ను వ్యతిరేకిస్తుంటాం గానీ.. ఆయన బిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
ఆల్రెడీ బిఆర్ఎస్తో తెలంగాణలో ఎర్ర పార్టీలు పొత్తుల్లోనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే.. సిపిఐ, సిపిఎం పార్టీలు రెండింటికీ.. బిజెపి వ్యతిరేకతను మించిన ఎజెండా వేరే ఏమీ ఉండదు. అదే ఎజెండాతో చాలా దూకుడుగా వస్తున్న కేసీఆర్కు వారు మద్దతివ్వకుండా ఉంటారనుకోవడం భ్రమ. అయితే కేసీఆర్– బిఆర్ఎస్ కు మద్దతివ్వడం లేదా పొత్తు పెట్టుకోవడం అనే బంధం ద్వారా.. ఏపీలో తమ పార్టీకి కూడా ఏ కొంచెమైనా లాభం ఉంటుందనే ఆశ వారికి ఉండొచ్చు.
ఏపీలో బిఆర్ఎస్తో ఎర్రదండు జట్టుకడుతుందనేది అనూహ్యమైన సంగతేమీ కాదు. కానీ.. ఈ పొత్తుబంధం ద్వారా వాళ్లు ఎలా లబ్ధిపొందగలరు? అనేదే ప్రశ్న.
వామపక్ష పార్టీలకు ఏపీలో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. కానీ ఏ ఎన్నికలొచ్చినా వారికి దక్కేసీట్లు మాత్రం ఉండవు. సీట్లు పొందిన సందర్భాలన్నీ ఇతరులతో పొత్తు పెట్టుకుని.. వాటాగా తీసుకున్నచోట్ల పోటీచేసినప్పుడు మాత్రమే.
కానీ.. ఏపీలో అధికారం మీద ఆశ ఉండే స్థానిక ప్రాంతీయ పార్టీలు చాలా స్వల్పంగా మాత్రమే వారికి సీట్లు కేటాయిస్తూ వచ్చాయి. కానీ బిఆర్ఎస్ తో వారికి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. పోటీచేసే ఓపిక ఉండాలే గానీ.. ఎక్కువ సీట్లు దక్కవచ్చు. కేసీఆర్ అండవలన రొటీన్ గా ఉండే బలం కంటె ఎక్కువ ఓట్లు వారికి దక్కవచ్చు. సీట్లు అనేది అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.