అవినాష్‌రెడ్డిని వెంటాడుతున్న సునీత‌

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని వైఎస్ వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత వెంటాడుతున్నారు. త‌న తండ్రిని అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేయ‌డాన్ని ఆమె జీర్ణించుకోలేకున్నారు. త‌న తండ్రి హత్య‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారులు, పాత్ర‌ధారులు…

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని వైఎస్ వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత వెంటాడుతున్నారు. త‌న తండ్రిని అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేయ‌డాన్ని ఆమె జీర్ణించుకోలేకున్నారు. త‌న తండ్రి హత్య‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారులు, పాత్ర‌ధారులు వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అవినాష్‌రెడ్డే అని సునీత బ‌లంగా న‌మ్ముతున్నారు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారికి శిక్ష ప‌డేలా చేయాల‌ని ఆమె న్యాయ‌పోరాటం చేస్తున్నారు.

హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదంటూ న్యాయ‌పోరాటం చేస్తున్నారు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి వేసిన , వేస్తున్న పిటిష‌న్ల‌లో డాక్ట‌ర్ సునీత ఇంప్లీడ్ కావ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుల‌లో తండ్రీత‌న‌యుడు ఎలాంటి పిటిషన్ వేసినా, వెంట‌నే త‌న వాద‌న వినాలంటూ సునీత న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తున్నారు.

ఇదే విష‌యాన్ని అవినాష్‌రెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు. తన‌కు సంబంధించి ప్ర‌తి క‌ద‌లిక‌ను సోద‌రి సునీత‌కు సీబీఐ తెలియ‌జేస్తోంద‌ని, ఇద్ద‌రూ కూడ‌బలుక్కుని న్యాయ‌స్థానాల్లో అఫిడ‌విట్లు వేస్తున్నార‌ని అవినాష్‌రెడ్డి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. తాజాగా మ‌రోసారి అవినాష్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇటీవ‌ల వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సీబీఐ క‌స్ట‌డీలో భాస్క‌ర్‌రెడ్డి, మ‌రో నిందితుడు ఉద‌య్ ఉన్నారు.

ఈ నెల 25వ తేదీ వ‌ర‌కూ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్ద‌ని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ డాక్ట‌ర్ సునీత ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సునీత త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూద్రా సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు స్వీక‌రించింది. శుక్ర‌వారం విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు సీజే తెలిపారు. 25వ తేదీ వ‌ర‌కూ తెలంగాణ హైకోర్టులో ఉప‌శ‌మ‌నం ల‌భించింద‌న్న ఆనందిస్తున్న అవినాష్‌లో సునీత పిటిష‌న్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోన‌న్న ఉత్కంఠ నెల‌కుంది.