మూడు రాజధానులపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి ఇరగదీశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశాన్ని అవహేళన చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. మూడు రాజధానులనేవి కేవలం సాంకేతిక అంశమే తప్ప, మరొకటి కాదన్నారు. ఎక్కడి నుంచైతే పరిపాన సాగిస్తారో అదే రాజధాని అని తేల్చి చెప్పారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అని, రాజధాని మాత్రం కటక్‌లో వుంటుందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
ఇలా మన దేశంలోనే 8 రాష్ట్రాల్లో పరిపాలన ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉన్నాయన్నారు. అయినంత మాత్రాన రాజధాని ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారా? అని నిలదీశారు. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ మరోసారి విశాఖకు రాజధానిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
విశాఖపట్నమే ఏకైక రాజధాని అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. కర్నూలు, అమరావతిలో ఆయా శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయన్నారు. తమిళనాడులో చెన్నై రాష్ట్రానికి మధ్యలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అంతెందుకు, మొన్నటి వరకూ హైదరాబాద్ రాష్ట్రానికి మధ్యలో ఉందా? అని ధర్మాన ప్రశ్నించారు. మహారాష్ట్రకు బాంబే, పశ్చిమబెంగాల్‌కు కలకత్తా సెంటర్‌లో ఉన్నాయా? అని ప్రతిపక్ష పార్టీలను నిలదీశారు.
రాజధానికి సెంటర్ అనేది ప్రామాణికం కాదన్నారు. రాజధానికి ప్రధానంగా కనెక్టివిటీ, సౌకర్యాలను మాత్రమే చూస్తారన్నారు. ఉత్తరాంధ్రలో ఏ ఒక్కరైనా విశాఖకు రాజధాని వద్దన్నారా? అని ప్రశ్నించారు. రాజధాని వస్తే అభివృద్ధి చెందుతుందా? అని తెలిసీతెలియక మాట్లాడుతున్నారన్నారు. రాజధాని వస్తే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయన్నారు. హైదరాబాద్‌కు ఎలా వచ్చాయో దీనికి కూడా అలాగే వస్తాయన్నారు. ఆ పెట్టబడులతో ఉద్యోగాలు వస్తాయన్నారు.
రాజధాని చుట్టుపక్కల భూముల విలువ పెరుగుతుందన్నారు. జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఇవన్నీ తెలిసి కూడా తెలియనట్టు చెబుతున్నారని విమర్శించారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఇవ్వాలనడంపై సీఎం జగన్ గట్టిగా నిలబడ్డారన్నారు. విశాఖలో రాజధాని కోసం 500 ఎకరాలు చాలన్నారు. విశాఖలో ఎయిర్‌పోర్ట్, సీ పోర్ట్ ఉన్నాయని, త్వరలో రైల్వేజోన్ వస్తుందని, అన్ని రకాలుగా మంచి ప్లేస్ అవుతుందన్నారు. అలాగే ఎవరొచ్చినా ఆదరించే గుణం, హత్తుకునే సంస్కారం విశాఖకు వుందని ఆయన తేల్చి చెప్పారు.