మునుగోడులో టీఆర్ఎస్ విజయం వెనుక వామపక్షాలున్నాయన్నది నిజం. టీఆర్ఎస్‌కు సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతు లేకపోయి వుంటే, బీజేపీ తప్పక గెలిచేదని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. ఒకవేళ మునుగోడులో బీజేపీ గెలిచి వుంటే… మరో ఏడాది వరకూ టీఆర్ఎస్ పాలన సవ్యంగా సాగి వుండేది కాదు. తెలంగాణ అంతటా బీజేపీ బలంగా వుందనే సంకేతాలు వెళ్లేవి. దీంతో అధికార పార్టీలో అసమ్మతి రాగాలు వినిపించేవి.
ఇలా ప్రమాదం నుంచి తమను గట్టెక్కించిన వామపక్షాలపై టీఆర్ఎస్ ఎంతో సానుకూల ధోరణితో వ్యవహరిస్తోంది. మునుగోడులో తమ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన సీపీఐ నేతలకు కృతజ్ఞతలు చెప్పడానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు కొత్త ఎమ్మెల్యే కూసుకుంట్లు ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు సీపీఐ ముఖ్య నాయకులకు మంత్రి, ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో కూడా వామపక్షాలతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. దీంతో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ మధ్య పొత్తు వుంటుందని స్పష్టమైంది. అయితే మునుగోడు వరకే టీఆర్ఎస్‌తో తమ పొత్తు వుంటుందని, ఆ తర్వాత ఆలోచిస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం చెప్పిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ఇప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో వామపక్షాలకు బలం వుంది. సొంతంగా గెలవలేకపోయినా, ఇతర పార్టీలను ఓడించడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే వామపక్షాలతో పొత్తుకు టీఆర్ఎస్ సానుకూలంగా ఉంది. మరోసారి అవే సంకేతాల్ని తమ శ్రేణులకి ఇరు పార్టీలు పంపడం గమనార్హం.