తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహార విచారణకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులను విచారించొచ్చని హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికకు ముందు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఆయనతో పాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ మొత్తంలో డీల్‌కు యత్నించడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
ఈ వ్యవహారంలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని దోషిగా చూపుతూ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో వ్యవహారం ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు మొయినాబాద్ పోలీసులకు పట్టుబడిన ముగ్గురి నిందితులు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
వీరిని మొదట అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, వెంటనే వారిని విడుదల చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో నిందితులను విడుదల చేశారు. అయితే ఇదే అంశంపై నిందితులు హైదరాబాద్ నగరం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత అరెస్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వారి విచారణపై స్టేను ఎత్తి వేసింది.
నిందితులైన రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నందకుమార్‌లను విచారించాలని హైకోర్టు ఆదేశించడంపై కేసీఆర్ సర్కార్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో బీజేపీ పెద్దల హస్తం వుందని చట్ట ప్రకారం నిరూపించాలనే పట్టుదలతో కేసీఆర్ ప్రభుత్వం వుంది. మరి తెలంగాణ సర్కార్ ఆశ ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.