Advertisement

Advertisement


Home > Politics - Gossip

దేవినేని శ‌కం ముగుస్తోందా?

దేవినేని శ‌కం ముగుస్తోందా?

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయ శ‌కం ముగుస్తోందా? అంటే...ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌మాద‌శాత్తు ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉమా అన్న దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో, ఆ త‌ర్వాత ఆయ‌న భార్య కూడా ఆక‌స్మికంగా ప్రాణాలు కోల్పోవ‌డంతో దేవినేని ఉమా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. అంత వ‌ర‌కూ వ‌రుస‌కు అన్న అయిన దేవినేని నెహ్రూ వెంట ఉమా న‌డిచేవారు.

నందిగామ‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి రెండేసి సార్లు మొత్తం నాలుగు ద‌ఫాలు ఉమా ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌కమైన జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. స‌హ‌జంగానే ఉమా వ్య‌వ‌హార‌శైలి అహంకార‌పూరితంగా వుంటుంద‌ని టీడీపీ నేత‌లు, శ్రేణులు చెప్పే మాట‌. ఆయ‌న మాట‌ల్లో కూడా అది క‌నిపిస్తూ వుంటుంది. నిండు అసెంబ్లీలో "నీ సాక్షి ప‌త్రిక‌లో రాసుకో జ‌గ‌న్‌...2018 నాటికి పోల‌వ‌రం పూర్తి చేసి తీరుతాం" అని దేవినేని ఉమా అహంకార స్వ‌రంతో మాట్లాడ్డం ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ గుర్తు వుంటుంది.

ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స‌మావేశం నిర్వ‌హించారు. ఆ స‌మావేశంలో గుడివాడ టీడీపీ నాయ‌కుడితో కొడాలి నానిపై తొడ‌లు కొట్టించి, మీసాలు తిప్పించి ఉమా రెచ్చ‌గొట్టించిన సంగ‌తి తెలిసిందే. ఉమాపై ఇంత కాలం సొంత సామాజిక వ‌ర్గేత‌ర కులాల వారు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్న‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు సొంత సామాజిక వ‌ర్గం నుంచి కూడా తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. దేవినేని ఉమా రాజ‌కీయ శ‌కం ముగుస్తుంద‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు.

రెండురోజుల క్రితం ఉమాకు వ్య‌తిరేకంగా  గొల్ల‌పూడిలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆత్మీయ స‌ద‌స్సు నిర్వ‌హించారు. దీనికి టీడీపీ నాయ‌కుడు బొమ్మ‌సాని సుబ్బారావు నాయ‌క‌త్వం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించ‌డం విశేషం. ఈ స‌మావేశం వెనుక లోకేశ్‌తో పాటు టీడీపీ ముఖ్య నేత‌లు ఉన్నార‌ని దేవినేని ఉమా అనుమానిస్తున్నార‌ని తెలిసింది. అస‌లే కృష్ణా జిల్లాలో ఉమాతో ఏ ఒక్క టీడీపీ నేత‌కు మంచి సంబంధాలు లేవు. ఈ విషయాన్ని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు క్ర‌మంగా ఉమాను దూరం పెడుతున్నార‌ని టీడీపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఉమాను త‌న‌కు దూరంగా వెనుక పెట్ట‌డాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.

స‌ర్వేలో ఎవ‌రికైతే పాజిటివ్‌గా నివేదిక వ‌స్తుందో, వారికే టికెట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేవినేని ఉమా గురించి నెగెటివ్ త‌ప్ప‌, ఏ ఒక్క‌రూ అనుకూలంగా చెప్ప‌న‌ట్టు తెలుస్తోంది. పార్టీకి భార‌మైన వాళ్ల‌ను విడిపించుకోడానికే చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్నారు. ఆ జాబితాలో దేవినేని ఉమా ఉన్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఒక‌వేళ ఆయ‌న‌పై వ్య‌తిరేక‌తను కాద‌ని టికెట్ ఇస్తే... సొంత పార్టీ వాళ్లే ఓడిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నింటికీ కాల‌మే ప‌రిష్కారం చూపాల్సి వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?