ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి కేఆర్ సూర్యనారాయణపై వైసీపీ సర్కార్ ఎట్టకేలకు వేటు వేసింది. సూర్యనారాయణ తానొక ఉద్యోగ సంఘం అధ్యక్షుడిననే విషయాన్ని మరిచిపోయి, రాజకీయ ప్రత్యర్థి వలే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దల్ని కాకుండా, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రభుత్వంతో గొడవకు దిగి, చివరికి అవినీతి కేసులో పరారీలో ఉన్న సూర్యనారాయణ సస్పెండ్‌కు గురి కావడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ కార్యాలయంలో సూర్యనారాయణ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సూర్యనారాయణతో పాటు సహచర ఉద్యోగులపై అవినీతి ఆరోపణల గురించి ప్రభుత్వం ప్రస్తావించింది.
2019 నుంచి 2021 మధ్య కాలంలో మెహర్‌కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణలతో కలిసి సూర్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టారని ప్రభుత్వ అభియోగం. తనిఖీల పేరుతో వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో అక్రమ వసూళ్లు చేశారనేది ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తోంది.
వీరిలో సూర్యనారాయణ మినహా మిగిలిన ఉద్యోగుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణతో కలిసి కుట్ర చేసినట్టు బయటపడింది. ఈ ఏడాది మే 30న విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో సూర్యనారాయణ ఏ5గా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు.
ముందస్తు బెయిల్ కోసం సూర్యనారాయణ చేస్తున్న న్యాయపోరాటంలో ఆయనకు ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెండ్ వేటు వేయడం గమనార్హం. క్రమశిక్షనా చర్యలు పూర్తిగా తీసుకునే వరకూ ఆయనపై సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రొసీడింగ్స్‌లో రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ స్పష్టం చేశారు.