పెరిగిన టమాట ధరతో దేశవ్యాప్తంగా కొంతమంది రైతులు భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఆదాయం పొందిన రైతులున్నారు. మొన్నటికిమొన్న మెదక్ జిల్లాకు చెందిన మైపాల్ రెడ్డి టమాటల ద్వారా 2 కోట్లు ఆర్జించి రికార్డ్ సృష్టించగా, ఇప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి అనే రైతు ఏకంగా 3 కోట్ల లాభం ఆర్జించి సంచలనం సృష్టించాడు.
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం, సువ్వారావుపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు.. టామాటాలు పండించి కోటీశ్వరుడయ్యాడు. ఖర్చులు పోనూ ఏకంగా 3 కోట్ల రూపాయలు ఆర్జించాడు. చిత్తూరులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే టమాట ద్వారా అత్యథిక ఆదాయం పొందిన రైతుగా రికార్డ్ సృష్టించాడు.
తమ్ముడు మురళి, తల్లి రాజమ్మతో కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నాడు చంద్రమౌళి. సొంతూరు కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారాపుపల్లెలో 20 ఎకరాలు ఉంది. టమాట సాగులో అతడికి మంచి పట్టు ఉంది. గతంలో గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన టమాటాలు పడేసిన అనుభవం కూడా ఉంది. అయినప్పటికీ మరోసారి టామాట సాగునే నమ్ముకున్నాడు.
ఏకంగా 70 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి, తమ ఉమ్మడి పొలంలో టమాట వేశాడు. ఈసారి అతడి అదృష్టం పండింది. 2 నెలల్లో ఖర్చులు పోనూ 3 కోట్ల రూపాయల లాభం ఆర్జించాడు.
తను పండించిన టమాటాల్ని కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో అమ్మాడు చంద్రమౌళి. అలా 2 నెలల్లో దశలవారీగా 40వేల టమాట డబ్బాలు అమ్మాడు. 4 కోట్లు ఆదాయం రాగా.. పెట్టిన పెట్టుబడి, కమీషన్, రవాణా ఛార్జీలు పోనూ 3 కోట్లు మిగిలినట్టు వెల్లడించాడు.