పయ్యావుల మాటల్లో అమరావతి ఓటమి భయం!

తెలుగుదేశం పార్టీలోని అసలు భయం ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది ఆ పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ మంగళగిరి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి తమ పార్టీ యొక్క అసలు భయాన్ని చాటి…

తెలుగుదేశం పార్టీలోని అసలు భయం ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది ఆ పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ మంగళగిరి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి తమ పార్టీ యొక్క అసలు భయాన్ని చాటి చెప్పారు! పాపం ఆయన జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి తానేదేదో చెబుతున్నానని అనుకొని ఉండవచ్చు గానిన.. ఆయన ప్రసంగం వాదన పూర్తయ్యేసరికి అచ్చంగా తెలుగుదేశం పార్టీ ఏ భయంతో అయితే వణికిపోతున్నదో ఆ భయం బయట పడిపోయింది!! ‘అమరావతిని నమ్ముకున్నందుకు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పరాజయం తప్పదు’ అనే భయం తెలుగుదేశంలో ఎంత ప్రబలంగా ఉన్నదో పయ్యావుల కేశవ్ మాటల్లో వెలికి వచ్చింది.

కేశవ్ ఏమంటున్నారంటే వచ్చే ఎన్నికల వరకు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టకుండా సాగదీయడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. పయ్యావుల కేశవ్ మాటలు, ఆరోపణలు కాసేపు నిజమే అని అనుకుందాం… ‘‘సుప్రీంకోర్టులో కాదు కావాలంటే ప్రజా కోర్టులో తేల్చుకుందాం రా’’ అని పదేపదే ప్రగల్భాలు పలుకుతున్న తెలుగుదేశం నాయకులు, వారి తైనాతీ జనసేన నాయకులు కోరుకుంటున్నది కూడా అదే కదా.. వచ్చే ఎన్నికల వరకు సాగదీయాలని జగన్ అనుకుంటున్నది నిజమే అయితే.. ఈ రాష్ట్ర ప్రజలు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారో.. రాష్ట్రానికి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి మూడు రాజధానులు కావాలని అభిలషిస్తున్నారో.. స్పష్టమైపోతుంది కదా! పయ్యావుల కేశవ్ ఎందుకు ఇంతగా గొంతు చించుకుంటున్నారు అనేది అందరికీ కలిగే సందేహం!!

ఇక్కడ మరొక విషయాన్నీ మనం ప్రధానంగా గమనించాలి. అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడుకు ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక మరణ శాసనం! ఆయన ఏ ముహూర్తాన అమరావతి రాజధానిని సంకల్పించారో గాని అదే ఆయన పార్టీ సమస్తాన్ని, వారి పతనాన్ని నిర్దేశిస్తోంది. 

చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు సరే.. రైతులు నుంచి వేల ఎకరాలు పోగు చేశారు సరే.. నిర్మాణాత్మకంగా అక్కడ ఏం చేశారు.. ‘తాత్కాలిక’ అనే పేరు పెట్టి నిర్మించిన సచివాలయ భవనాలు తప్ప! రాజధాని కోసం తనకున్న నాలుగేళ్ల వ్యవధిలో ఖచ్చితమైన భవనాలుగా ఆయన చేసింది శూన్యం. ఆయన నిష్క్రియాపరత్వాన్ని సహించలేకనే, రాజధాని అనేది ఆయనకు చేతకాదు అనే భావన ఏర్పడడం వల్లనే తెలుగు ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును దారుణంగా తిరస్కరించారు. సాక్షాత్తు అమరావతి రాజధాని కొలువుదీరిన ప్రాంతమే అయినా.. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ను కూడా దారుణంగా ఓడించారు. అలా రాజధాని తనకు చేతకాదు అనే ప్రజలు నమ్మడం వల్ల చంద్రబాబు నాయుడు ఒకసారి పతనావస్థకు చేరుకున్నారు.

ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. మరో రకంగా అమరావతి ఆయనకు మరణ శాసనం రాయబోతోంది. మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల దృష్టిని ఆకర్షించారు. అటు తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత బలంగా ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమ్మోహితుల్ని చేశారు. రాయలసీమ సంగతి సరే సరే సరి. తొలి నుంచి ప్రతి దశలోనూ తమకు అన్యాయం జరుగుతున్నదని భావిస్తున్న రాయలసీమ వాసులు న్యాయ రాజధానికి తాము కేంద్రం కాబోతున్నామని తెలిసాక పండగ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని మాటలతో.. ఈ ఇతర ప్రాంతాల ప్రజల ద్వేషాన్ని చంద్రబాబు నాయుడు మూటగట్టుకుంటున్నారు. అందుకే ఆయనకు ఈ అజెండాతో ఎన్నికలకు వెళ్లాలంటే భయం!

జగన్ చేసింది తప్పే అయితే గనుక సుప్రీంకోర్టులో పిటిషన్ ద్వారా సాగదీసి ఏ విషయమూ తేల్చకుండా ఎన్నికలకు వెళ్లాలని జగన్ అనుకుంటే దాని వలన అడ్వాంటేజీ తెలుగుదేశానికే కదా! ఎన్నికల దాకా సాగదీస్తాడు అని వాళ్ళు కుమిలిపోవడం ఎందుకు? ఎన్నికలు వస్తే అమరావతి లేదా మూడు రాజధానులు అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో మాత్రమే పోరాడి.. ప్రజల మద్దతు ఎటువైపు ఉన్నదో తేల్చుకోవడానికి తెలుగుదేశం సిద్దపడవచ్చు కదా..!